మిమ్మల్ని ఎలా కట్టడి చేయాలో మాకు తెలుసు.. లోకేశ్ హెచ్చరిక

ఏపీలోని అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై ఏపీ మాజీ మంత్రి, టీడీపీ నేత నారా లోకేశ్ నిప్పులు చెరిగారు. టీడీపీ కార్యకర్త రాజేశ్వరి.. చంద్రబాబును కలిసిన ఫొటోలతో సోషల్ మీడియాలో ఇష్టంవచ్చినట్టు ప్రచారం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజేశ్వరి కుమారుడిని చంద్రబాబు ఆదుకున్నారని, ఆమె దృష్టిలో చంద్రబాబు దైవం లాంటి వారని అన్నారు. అలాంటిది వారి ఫొటోలు పెట్టి దుష్ప్రచారం చేస్తారా? అని ప్రశ్నించారు. ఇక, ఆ ఫొటోలకు వచ్చిన కామెంట్లు అయితే అత్యంత జుగుప్సాకరంగా ఉన్నాయని అన్నారు.

బీసీ మహిళను ఇంత నీచంగా అవమానిస్తారా? అని నిలదీశారు. వైసీపీ అహంకారంపై ఆ పార్టీ పెద్దగా జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అయినా, దొంగలు, అవినీతిపరులు, జైలు పక్షులు అధికారంలోకి వస్తే ఇంతకంటే ఎక్కువ ఊహించలేమని, ఇలాగే ఉంటుందని అన్నారు. తమ సహనానికి కూడా ఓ హద్దు ఉంటుందని లోకేశ్ అన్నారు. టీడీపీ కార్యకర్తలపై దాడులు చేస్తున్నారని, వారి ఆస్తులను ధ్వంసం చేస్తున్నారని, ప్రాణాలు తీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, వైసీపీ నేతలను ఎలా కట్టడి చేయాలో తమకు తెలుసని, వారికి బుద్ధి చెప్పే వరకు పోరాడుతూనే ఉంటామని పేర్కొన్న లోకేశ్.. ఖబడ్దార్ అని హెచ్చరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *