మితిమీరిన ఆత్మవిశ్వాసం వద్దు: చంద్రబాబు

నంద్యాల, కాకినాడ గెలుపులు చూసి మితిమీరిన ఆత్మవిశ్వాసం ప్రదర్శించవద్దని తెదేపా అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడునేతలకు సూచించారు. నాయకుడికి ప్రతి ఎన్నిక ఒక పాఠం లాంటిదన్నారు. ఫలితాలపై తప్పొప్పులు సమీక్షించుకోవాలని సూచించారు. 2018 డిసెంబర్‌ నాటికి సార్వత్రిక ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని నేతలకు పిలుపునిచ్చారు. 2019 ఎన్నికల్లో అన్ని సీట్లూ గెలుచుకునేలా ప్రణాళికలను రూపొందించాలని శ్రేణులకు దిశానిర్దేశం చేశారు.
గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని హ్యాపీ రిసార్ట్‌లో పార్టీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన ప్రత్యేక కార్యాచరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రులతో పాటు రెండు చోట్లా పార్టీ గెలుపుకోసం పనిచేసిన నేతలందరూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. నంద్యాల, కాకినాడ ఎన్నికల ఫలితాల వల్ల ప్రజల్లో విశ్వాసం పెరిగిందన్నారు. పెట్టుబడిదారుల్లో నమ్మకం పెరిగిందని చెప్పారు. ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాల్జేయాలన్న ప్రతిపక్షం కుట్రలను ప్రజలు భగ్నం చేసి, అభివృద్ధికి ఓటేశారని చెప్పారు.
నంద్యాల ఉప ఎన్నికలో తెదేపాకు 56 శాతం పోలింగ్‌ నమోదైందని, వచ్చే ఎన్నికల్లో దాన్ని 60 శాతానికి పెంచుకోవాలని సూచించారు.రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యం కావాలన్నారు. ఈ సందర్భంగా పబ్లిక్‌ మేనేజ్‌మెంట్‌, పొలిటికల్‌ మేనేజ్‌మెంట్‌, పోల్‌ మేనేజ్‌మెంట్‌లపై పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ గంటన్నరపాటు పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చారు. ఈ శిబిరంలో పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు కళా వెంకట్రావు, పెద్ది రామారావు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. విజయవాడ ఏ కన్వెన్‌ సెంటర్‌లో మంగళవారం ఇవాల్టి కార్యక్రమానికి కొనసాగింపుగా శిక్షణా తరగతులు నిర్వహించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *