మహాకల్తీ కూటమి

మహాకల్తీ కూటమి

పార్లమెంట్ సాక్షిగా ప్రధాని నరేంద్రమోదీ ప్రతిపక్షపార్టీలపై విరుచుకుపడ్డారు. దేశంలో ఎమర్జెన్సీ విధించినవారు, న్యాయవ్యవస్థను బెదిరించిన వారు, సైన్యాన్ని అవమానించిన వారు నేడు తనను రాజ్యాంగ సంస్థలను ధ్వంసం చేస్తున్నానంటూ విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాఫెల్ ఒప్పందాన్ని తప్పు పడుతున్న కాంగ్రెస్ నేతలకు భారత నౌకా దళం మరింత శక్తిమంతం కావడం ఇష్టం లేదన్నారు. ఏ కంపెనీలకు ఆ కాంట్రాక్టును కట్టబెట్టాలని ఇంత సిగ్గులేకుండా వ్యవహరిస్తున్నారు అంటూ తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షాల మహా కూటమిని ఎద్దేవా చేస్తూ ప్రజలు మహాకల్తీని కోరుకోవడం లేదు. ఆరోగ్యవంతమైన మన ప్రజాస్వామ్యం దానిని తిరస్కరిస్తుంది అని పేర్కొన్నారు.

రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై లోక్‌సభలో జరిగిన చర్చకు ప్రధాని గురువారం సమాధానమిచ్చారు. దాదాపు 100 నిమిషాలు మాట్లాడిన ప్రధాని తన ప్రభుత్వ విజయాలను ప్రస్తావిస్తూ ప్రతిపక్షాలపై విమర్శల దాడి చేశారు. తన 55 నెలల పాలనను కాంగ్రెస్ 55 ఏండ్ల పాలనతో పోల్చారు. వారిది సత్తా భోగ్ (అధికార సంబురం), నాది సేవా భావ్ (సేవాభావం) అన్నారు. ఓ పేద కుటుంబం నుంచి వచ్చి వారి రాచరికాన్ని సవాలు చేసినందుకే తనపై కక్షగట్టారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ఎమర్జెన్సీ విధించింది. ఆర్మీ చీఫ్‌ను గూండా అని అవమానించింది. ఎన్నికల కమిషన్‌పై, ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలపై సందేహాలు వ్యక్తం చేసింది. మరోవైపు రాజ్యాంగ సంస్థలను మోదీ ధ్వంసం చేస్తున్నారంటూ ఆరోపిస్తున్నది అంటూ ప్రధాని విరుచుకుపడ్డారు. న్యాయవ్యవస్థను కాంగ్రెస్ నేతలు బెదిరిస్తారు. ప్రణాళికా సంఘాన్ని జోకర్ల గుంపు అని వ్యాఖ్యానిస్తారు.. మళ్లీ రాజ్యాంగ సంస్థలను మోదీ ధ్వంసం చేస్తున్నారని చెప్తారు అంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఆర్టికల్ 356ను దుర్వినియోగం చేస్తూ ఎన్నోసార్లు రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేసింది. స్వయంగా ఇందిరాగాంధీ 50సార్లు రాష్ట్ర ప్రభుత్వాలను రద్దు చేశారు అని మోదీ చెప్పారు.

కోల్‌కతాలో ఇటీవల మమతా బెనర్జీ ఆధ్వర్యంలో జరిగిన ప్రతిపక్షాల సభపై కూడా మోదీ విమర్శలు సంధించారు. కోల్‌కతాలో సమావేశమైన వారితో కూడిన మహా కల్తీ ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకోవడం లేదు. ప్రభుత్వం భారత ప్రజల కోసం పనిచేయాలి. ప్రజల ఆకాంక్షల పట్ల ఆసక్తి కలిగి ఉండాలి. అవినీతికి తావుండరాదు. మేము దేశం లోపల ఉన్నా బయటకు వెళ్లినా, పార్లమెంట్ లోపల ఉన్నా, వెలుపల ఉన్నా నిజమే మాట్లాడుతాం. కానీ నిజాన్ని వినే సహనం మీలో నశించింది అంటూ ఆయన నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ సైన్యాన్ని బలహీనపరచిందని, అందుకే లక్షిత దాడులపై సందేహాలు వ్యక్తం చేసిందని ఆరోపించారు. అవినీతిని తాము చాలావరకు అరికట్టామని ప్రధాని చెప్పారు. దేశాన్ని లూటీ చేసినవారు తనను చూసి భయపడుతూనే ఉంటారని అన్నారు. దేశాన్ని ఏలిన కాంగ్రెస్ ప్రభుత్వాలు అవినీతిలో కూరుకుపోయి, అవినీతిపరులకు అండగా నిలిచాయని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో తమ ప్రభుత్వమే మళ్లీ అధికారానికి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేసిన మోదీ అవినీతిపరుల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని పేర్కొన్నారు. అగస్టా వెస్ట్‌ల్యాండ్ హెలికాప్టర్ల కేసులో విదేశాల నుంచి నిందితులను పట్టుకొస్తుండటంతో ప్రతిపక్షంలోని కొందరిలో వణుకు పుడుతున్నదని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *