మట్టిపనికైనా మనోడే ఉండాలె

మట్టిపనికైనా మనోడే ఉండాలె

మట్టిపనికైనా మనోడే ఉండాలని ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర్‌రావు చెప్పారు. ఇక్కడ బీజేపీ ఎంపీ గెలిచినా, కాంగ్రెస్ ఎంపీ గెలిచినా.. వీరు ఢిల్లీ గులాములేకానీ మాట్లాడేవాళ్లు కాదన్నారు. రాహుల్, మోదీ ముందు వాళ్లు మాట్లాడుతరా? సిట్ అంటే సిట్.. స్టాండ్ అంటే స్టాండ్! మూత్రం పోయాలన్నా ఢిల్లీవాళ్ల అనుమతి కావాలి అని ఎద్దేవాచేశారు. టీఆర్‌ఎస్ ఎంపీలైతే.. ఇద్దరైనా మీరిచ్చిన బలాన్ని ఉపయోగించి పేగులు తెగేవరకు పోరాడి తెలంగాణ తెచ్చాం. ఇదే పద్ధతిలో తెలంగాణ ప్రయోజనాలు రక్షించుకునేందుకు.. మట్టిపనికైనా సరే ఇంటోడు ఉండాలన్నట్టు.. పదహారుమంది టీఆర్‌ఎస్ ఎంపీలుంటే తెలంగాణ హక్కులు నెరవేరుతయి అని చెప్పారు. ఈ దేశం కూడా బాగుపడాలని, పేదరికం పోవాలని, దేశంలో ఉన్న వనరులన్నీ దేశ సౌభాగ్యానికి ఉపయోగపడాలని, నిరుద్యోగ సమస్య పోవాలని, పంటలకు గిట్టుబాటు ధర లభించాలని, మౌలిక సదుపాయాలు పెరుగాలని సీఎం ఆకాంక్షించారు. ఇవన్నీ జరుగాలంటే కేంద్రంలో ఫెడరల్‌ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పడాలని, బీజేపీ లేని, కాంగ్రెస్‌లేని భారత్ కావాలని చెప్పారు. దళితులకు వర్గీకరణ ఫెడరల్ ఫ్రంట్‌తోనే సాధ్యమని స్పష్టంచేశారు. అత్యంత ధనికరాష్ట్రంగా ఉన్న తెలంగాణ.. ఇప్పుడు దేశాన్ని సాకుతున్న ఐదారు రాష్ర్టాల్లో ఒకటని అన్నారు. సంక్షేమంతోపాటు అనేక అంశాల్లో దేశానికి దిక్సూచిగా ఉన్నామని చెప్పారు. తెలంగాణ అవసరాలు, ప్రయోజనాలు, ప్రాజెక్టులు, హక్కులకోసం కచ్చితంగా టీఆర్‌ఎస్ ఎంపీలు గెలువాలన్నారు. మీరు గెలిపించే 16 మంది టీఆర్‌ఎస్ ఎంపీలతో దేశ రాజకీయ గమనాన్ని మార్చి.. దేశానికి ఒక దశ-దిశ చూపించేలా సర్వశక్తులు ఒడ్డుతానని పునరుద్ఘాటించారు. వరంగల్ సభలో ఆజంజాహీ మిల్లు ప్రాంతంలో సభ పెట్టినవాళ్లంతా ప్రధానులు అయ్యారన్న దయాకర్‌రావు వ్యాఖ్యలపై సీఎం స్పందిస్తూ..
ప్రధానమంత్రి ఎవరయితరని నాకు ఆసక్తి లేదు. ఆజంజాహీ మిల్లుల సభ పెట్టినోళ్లందరూ ప్రధానమంత్రి అయిండ్రని దయాకర్‌రావు చెప్పినరు. నాకు ప్రధానమంత్రి కావాలనే కోరిక లేదు అని వ్యాఖ్యానించారు. మంగళవారం వరంగల్, భువనగిరి లోక్‌సభ నియోజకవర్గాల ఎన్నికల ప్రచారసభల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడారు. సీఎం ప్రసంగంలోని ముఖ్యాంశాలు.. ఆయన మాటల్లోనే..
దేశం బాగుకోసం తెలంగాణనే వైతాళికుడు కావాలి..
దేశం బాగుపడడంకోసం తెలంగాణనే వైతాళికుడు కావాలి. మనమే ముందుపడుదాం. బలంగా కొట్లాడుదామా? పోవాల్నా? మీ దీవెన ఉంటే, నాంది ప్రస్తావన మీరే పలికితే.. దేశం నివ్వెరపోయేలా 16కు 16 ఎంపీ సీట్లు మనమే గెలిస్తే కచ్చితంగా ఢిల్లీని శాసించే పరిస్థితి నాది. పోలికేకపెట్టే బాధ్యత నాది. ఈ దేశం గతిని కూడా మార్చే బాధ్యత తీసుకుందాం. తెలంగాణ బిడ్డనే.. తెలంగాణ దశ మారుస్తున్నడు.. భారతదేశం కూడా మారుస్తడనే గౌరవం తెలంగాణ జాతికి దక్కేలా రాజీలేని పోరాటం చేస్తానని హామీ ఇస్తున్న.

వీళ్లా మనకు కావాల్సింది?
పార్లమెంట్ ఎన్నికలు మోపైనకాన్నుంచి రోజూ టీవీల్ల చూస్తూనే ఉన్నం. రాహుల్‌గాంధీ, నరేంద్రమోదీ.. ఒకనిమీద ఒగలు తిట్టుకుంటున్నరు. ప్రధానమంత్రి చోర్ హై అని ఒకడు అంటాడు. మా, బేటా జమానత్ మే హై అని నరేంద్రమోదీ అంటాడు. మైకులు పగులుతున్నయి. నాకైతే సమజ్‌గాలే.. ఎవల మీద బొబ్బ పెడుతున్నరు వీళ్లిద్దరు? ఇందులున్న తమాషా ఏంది? దేశానికి స్వాతంత్య్రం వచ్చి 73 ఏండ్లు అవుతున్నది. దేశాన్ని ఎన్డీయే రూపంలో పదకొండేండ్లు బీజేపీ, 55 ఏండ్లు కాంగ్రెస్ పాలించాయి. మధ్యలో ఓ నాలుగేండ్లు ఇతర పార్టీలు పాలించాయి. ఇంకెవరో పరిపాలించినట్టు.. ఒకరిమీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నరు మీ దొంగతనం బయటపడవద్దని! తెనాలి రామలింగని కథ ఉన్నది. నేను కొట్టినట్టు చేస్త.. నువ్వు ఏడిసినట్టు చెయ్యి అన్నట్టు వాళ్లువాళ్లే తన్నుకుంటే మనం బేజారుగావాలె! వీళ్లేనా మనకు కావాల్సింది? ప్రజలు లేరా? సమస్యలు లేవా? నేను దాదాపు ఏడాది నుంచి ఫెడరల్‌ఫ్రంట్ అని ఎప్పుడైతే మాట్లాడినానో.. ఆనాటినుంచి అడుగుతున్న. దేశంలో 70 వేల టీఎంసీల నీళ్లు ఉన్నయి. వ్యవసాయానికి అనుకూలమైన భూమి 40 కోట్ల ఎకరాలు. ప్రతి ఎకరాకు నీళ్లుపారించినా ఇంకా 30 వేల టీఎంసీలు మిగులుతయి. పదివేల టీఎంసీలు తాగునీళ్లకు, పారిశ్రామిక అవసరాలకు వాడుకున్నా.. ఇంకా 20 వేల టీఎంసీల మిగులు నీళ్లున్నయి. 73 ఏండ్లు గడిచిపోయినా ఇంకా మంచినీళ్లకు బాధ, సాగునీళ్లకు బాధ. కరువుతో అల్లాడాలె. వాటిని ఎందుకు వాడటం లేదంటే వాడు మాట్లాడడు.. వీడు మాట్లాడడు! సమస్యల మీద నిలదీస్తే చర్చకురారు. ఏమంటడు మోదీ? కేసీఆర్ యాగాలు చేసుడు ఎక్కువ, పూజలు చేసుడు ఎక్కువ.
Tags:CM KCR ,Public Meeting ,Bhongir ,Warangal ,Rahul Gandhi ,Modi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *