భారతదేశం ఒక అవినీతి దేశంగా ఎందుకు తయారైంది?

  • దేవుడికి డబ్బు సమర్పించి, ప్రతిఫలాన్ని ఆశించడం దగ్గర నుంచే అవినీతి మొదలవుతుంది
  • జయలలిత వంటి వారు జైలు నుంచి విడుదల కావడం పాశ్చాత్య దేశాల్లో అసంభవం
  • సమాజంలోని అసమానతలే అవినీతికి కారణం
  • కారణాలు ఇవే… ఓ న్యూజిలాండర్ విశ్లేషణ

అంతులేని అవినీతికి మన దేశం కేరాఫ్ అడ్రస్ అనే విషయం మనందరికీ తెలిసిందే. ప్రతి చోట, ప్రతి వ్యవస్థలోనూ అవినీతి రాజ్యమేలుతోంది. ఇదే అంశంపై న్యూజిలాండ్ కు చెందిన ఓ వ్యక్తి తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. ఆయన అభిప్రాయాలలో కొన్నింటిని మనం అంగీకరించకపోయినా… వ్యవస్థలోని అవినీతిని ఆయన తెలియజేసిన విధానాన్ని అభినందించాల్సిందే. ‘ఇండియాలోని అవినీతికి కారణాలపై ఓ న్యూజిలాండర్ అభిప్రాయం’ అనే శీర్షికతో కొనసాగిన కథనం ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆయన చెప్పిన విషయాలను ఆయన మాటల్లోనే చదువుదాం.

“అవినీతి అనే విషయాన్ని భారతీయులు అసాధారణమైన అశంగా చూస్తున్నట్టుగా కనిపించడం లేదు. ఇది అన్నిచోట్లా ఉండేదే అనే భావనలో ఉన్నారు. అవినీతిపరులను సరైన దారిలో పెట్టాలనే ఆలోచనను పక్కన పెట్టి… వారిని క్షమిస్తారు. భారతీయులు ఎందుకు అవినీతిపరులో? వారి విధానాలు ఏమిటో? ఓ సారి చూద్దాం.

ఇండియాలో మతం అనేది చాలా ముఖ్యమైనది. దేవుడికి భారతీయులు డబ్బును సమర్పించి, దానికి ప్రతిఫలాన్ని దేవుడి నుంచి ఆశిస్తారు. ఒక పని చేసి, దాన్నుంచి ప్రతిఫలాన్ని ఆశించడం ఇక్కడి నుంచే మొదలవుతుంది. దేవాలయాల నుంచి బయటకు వచ్చి చూస్తే దీన్ని ‘లంచం’ అనే అంటారు. సంపన్నులైన భారతీయులు దేవుళ్లకు డబ్బును కాకుండా… బంగారు కిరీటాలవంటివి ఇస్తుంటారు. తాను ఇచ్చిన డబ్బు దేవుడికి మాత్రమే, సామాన్య ప్రజలకు కాదు అనే భావనతోనే వారు ఇలా చేస్తారు.

2009 జూన్ లో కర్ణాటక మంత్రి గాలి జనార్దన్ రెడ్డి రూ. 45 కోట్ల విలువైన వజ్రాలతో పొదిగిన బంగారు కిరీటాన్ని తిరుమల వేంకటేశ్వరస్వామికి సమర్పించారు. ఇలాంటి డొనేషన్లతో దేవాలయాల ఖజానాల్లో వేల కోట్ల విలువైన సంపద మూలుగుతోంది. ఇలాంటి బహుమతులతో ఏం చేయాలో దేవాలయాల నిర్వాహకులకు కూడా తెలియదు.

యూరోపియన్లు ఇండియాకు వచ్చినప్పుడు వారు స్కూళ్లను నిర్మించారు. కానీ యూరప్, అమెరికాకు ఇండియన్లు వెళ్తే… అక్కడ వారు ఆలయాలను నిర్మిస్తారు. విదేశాల్లో భారతీయుల పాఠశాలలు ఉన్నట్టు మీరెప్పుడైనా విన్నారా? దేవుడు తాము సమర్పించేవాటిని స్వీకరిస్తే… తమకు అంతా మంచే జరుగుతుందని భారతీయులు భావిస్తారు. ఇది తప్పుకాదని అనుకుంటారు. ఇలాంటి లావాదేవీలను భారతీయ సంస్కృతి కూడా అనుమతిస్తోంది. ఈ కారణం వల్లే భారతీయులు చాలా సులభంగా అవినీతిపరులుగా మారిపోతారు.

ఎంతో అవినీతికి పాల్పడిన జయలలిత కూడా జైలు నుంచి విడుదలైంది. పాశ్చాత్య దేశాల్లో ఇది సాధ్యం కాదు. యుద్ధాల సమయంలో కూడా భారత్ లో అవినీతి ప్రాబల్యం ఎక్కువగా ఉంటుంది. గ్రీకులు, ఆధునిక యూరప్ యుద్ధాలతో పోల్చితో భారత్ యుద్ధాలు చాలా తక్కువ స్థాయుల్లోనే జరిగాయనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. భారత్ లో యుద్ధం అవసరం లేదు. సైన్యాన్ని మేనేజ్ చేయడానికి లంచం ఇస్తే సరిపోతుంది. లంచాన్ని ఇవ్వడం ద్వారా భారత్ లో ఏ రాజునైనా విదేశీయులు జయించవచ్చు. ప్లాసీ యుద్ధంలో భారతీయ రాజుకు చెందిన సైన్యం పెద్దగా పోరాడలేదు. మీర్ జాఫర్ కు క్లైవ్ లంచం ఇవ్వడం ద్వారా తన లక్ష్యాన్ని సాధించాడు.

1687లో గోల్కొండ కోటను కూడా లంచం ఇవ్వడం ద్వారానే ప్రత్యర్థులు జయించారు. లంచం తీసుకున్న వ్యక్తులు వెనుకవైపు ఉన్న రహస్య ద్వారాన్ని తెరవడం వల్లే గోల్కొండ ప్రత్యర్థుల వశమైంది. లంచం ఇవ్వడం ద్వారానే మరాఠాలు, రాజపుత్రులను మొఘలులు జయించారు. ఔరంగజేబ్ నుంచి లంచం తీసుకున్న శ్రీనగర్ రాజు… దారా శిఖో కుమారుడు సులేమాన్ ను ఆయనకు అప్పగించాడు.

ఇతర దేశాల్లో లేని ఇలాంటి అలవాటు భారత్ లో మాత్రమే ఎందుకుంది? అందరూ కలసికట్టుగా, నిజాయతీగా ఉంటే.. ఒక సమూహంగా ఎదుగుతామనే ఆలోచన భారతీయుల్లో లేదు. భారత్ లోని కుల వ్యవస్థ భారతీయులను విడదీస్తోంది. అందరూ సమానమే అనే భావన భారతీయుల్లో లేదు. ఈ భావన వారిని విడదీయడమే కాకుండా… ఎంతో మంది ఇతర మతాలను స్వీకరించే పరిస్థితిని కూడా తీసుకొచ్చింది. ఇలాంటి పరిస్థితుల కారణంగానే సిక్కిజం, జైనిజం, బుద్ధిజం వంటివి వచ్చాయి. ఎంతోమంది ఇస్లాం, క్రైస్తవ మతాలను స్వీకరించారు.

భారత్ లో భారతీయులు లేరు. ఉన్నవారంతా హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు తదితరులే. 1400 సంవత్సరాల క్రితం దేశంలోని ప్రతి ఒక్కరూ ఒకే నమ్మకాన్ని కలిగి ఉండేవారనే విషయాన్ని భారతీయులు మర్చిపోయారు. ఒక అనారోగ్యకరమైన సంస్కృతికి అలవాటు పడ్డారు. సమాజంలోని అసమానతలే అవినీతికి బాటలు వేశాయి. దేవుడిని ఎంతో నమ్మే వ్యక్తి కూడా లంచం కోరుకుంటున్నాడు. లంచం లేకుండా పని చేసే పరిస్థితి లేదు.”

న్యూజిలాండ్ కు చెందిన బ్రయాన్ అనే వ్యక్తి మన దేశ అవినీతిపై ఈ మేరకు తన అభిప్రాయాన్ని వ్యక్తీకరించాడు. బాధాకరమైనా తాను చెప్పింది నిజమేనని తెలిపాడు. ప్రపంచంలో అతి తక్కువ అవినీతి కలిగిన దేశాల్లో న్యూజిలాండ్ కూడా ఉండటం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *