బీజేపీ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్‌ కన్నుమూత

ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ తుది శ్వాస
శోకసంద్రంలో బీజేపీ శ్రేణులు
ఢిల్లీ ఎయిమ్స్ కు చేరుకుంటున్న బీజేపీ నేతలు
లాయర్‌గా కెరీర్‌ మొదలుపెట్టిన సుష్మా
బీజేపీ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్‌ మంగళవారం రాత్రి గుండెపోటుతో కన్నుమూశారు. ఆమె వయసు 67 సంవత్సరాలు. తీవ్ర అస్వస్థతకు గురైన ఆమెను కుటుంబ సభ్యులు ఢిల్లీలోని ఎయిమ్స్ కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ఆమె తుది శ్వాస విడిచారు. ఆమె మృతితో బీజేపీ శ్రేణులు శోకసంద్రంలో మునిగిపోయాయి. సుష్మా మరణ వార్త విని కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్‌ సింగ్‌, గడ్కరీ, హర్ష వర్ధన్‌ తదితరులు హుటాహుటిన ఎయిమ్స్ కు చేరుకున్నారు.

గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె, గడచిన సార్వత్రిక ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు. సోషల్‌ మీడియాలో చురుగ్గా ఉండే సుష్మాస్వరాజ్‌, ట్విట్టర్‌లో ఎప్పటికప్పుడు పోస్టులు చేస్తూ యాక్టివ్‌గా ఉన్నారు. లాయర్‌గా కెరీర్‌ మొదలుపెట్టిన అనంతరం రాజకీయాల్లో చేరి, అనతికాలంలోనే దేశరాజకీయాల్లో తనదైన ముద్రవేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. బీజేపీ ఫైర్‌ బ్రాండ్‌గా మంచి మనసున్న నాయకురాలిగా ప్రజలకు దగ్గరయ్యారు.

సుష్మా స్వరాజ్‌ 1952, ఫిబ్రవరి 14న హర్యానాలోని అంబాలా కంటోన్మెంటులో జన్మించారు. విద్యార్థి సంఘం నాయకురాలిగా ఆమె 1970లో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ఇందిరాగాంధీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేపట్టి,1977లో తొలిసారిగా హర్యానా రాష్ట్ర అసెంబ్లీలో అడుగుపెట్టారు. 1996, 1998లో వాజ్‌పేయి మంత్రివర్గంలో పనిచేశారు.1998లో ఢిల్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.

ఇక ప్రధాని మోదీ కేబినెట్‌లో 2014 మే 26న కేంద్రమంత్రిగా నియమితులయ్యారు. మేలో జరిగిన లోక్‌సభ ఎన్నికలకు ఆమె దూరంగా ఉన్నారు. సుష్మా స్వరాజ్‌ భర్త స్వరాజ్‌ కౌశల్‌ ప్రముఖ న్యాయవాది. ఆయన మిజోరాం గవర్నరుగా కూడా పనిచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *