బీజేపీ కుట్రలు ఫలించవు.. మా ప్రభుత్వం సేఫ్: సిద్ధరామయ్య

నిత్యం బాధపడుతూనే ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నట్టు కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య స్పందించారు. రాష్ట్రంలోని కాంగ్రెస్-జేడీఎస్ కూటమి ప్రభుత్వానికి వచ్చిన ముప్పేమీ లేదని, పూర్తికాలం తమ ప్రభుత్వం కొనసాగుతుందని ధీమా వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు ఫలించబోవన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా బుధవారం ఢిల్లీ చేరుకున్న సిద్ధరామయ్య అధ్యక్షుడికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు.

కాగా, రెండు రోజుల క్రితం ముఖ్యమంత్రి కుమారస్వామి మాట్లాడుతూ.. తాను బయటకు ముఖ్యమంత్రినే కానీ నిత్యం బాధను భరిస్తూనే సంకీర్ణ ప్రభుత్వాన్ని నడుపుతున్నట్టు చెప్పారు. అందుకు కారణాన్ని మాత్రం తాను చెప్పలేనంటూ కాంగ్రెస్‌ను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఈ నేపథ్యంలో సిద్ధరామయ్య ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *