బీజేపీలో చేరిన ఆరు రోజులకే రాజీనామా చేసేందుకు సిద్ధమైన టీఎంసీ మాజీ నేత!

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీకి షాకిచ్చి బీజేపీలో చేరిన టీఎంసీ నేత, బిర్భుం జిల్లాకు చెందిన ఎమ్మెల్యే మొనిరుల్ ఇస్లాం వారం కూడా తిరక్కుండానే కాషాయ పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. మొనిరుల్ బీజేపీలో చేరడాన్ని ఆ పార్టీ నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. ఆయన చేరికతో బెంగాల్‌లో బీజేపీ రెండుగా చీలిపోయింది. పలు కేసులున్న ఆయన చేరికతో పార్టీ ప్రతిష్ఠ దెబ్బతింటుందని ఓ వర్గం నేతలు ఆరోపించారు. ఆయన చేరికను బహిరంగంగానే విమర్శించారు.

ఎమ్మెల్యే మొనిరుల్ ఇస్లాంపై పలు కేసులు ఉన్నాయి. రాజకీయ ప్రత్యర్థులపై దాడులు, చిత్రహింసలు, అట్రాసిటీ వంటి కేసులు ఆయనపై ఉన్నాయి. ప్రత్యర్థులను తన కాళ్ల కింద నలిపేస్తానంటూ 2014లో ఆయన చేసిన వ్యాఖ్యలు అప్పట్లో తీవ్ర దుమారం రేపాయి.

బీజేపీ నేతల నుంచి తనపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుండడంతో ఇస్లాం స్పందించారు. రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. కాగా, ఇస్లాం వ్యవహారంపై బీజేపీ నేత ముకుల్ రాయ్ స్పందించారు. ఈ విషయంపై ఆలోచిస్తామన్నారు. చాలామంది మైనారిటీ నేతలు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని, వారిని ఎలా ఆపుతామని ప్రశ్నించారు. కాగా, మొనిరుల్ ఇస్లాం బీజేపీలో చేరిన వెంటనే బిర్భుం జిల్లాలకు చెందిన బీజేపీ నేతలు పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ నిర్వహించారు. వెంటనే ఆయనను పార్టీ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *