బాబు వ‌ర్సెస్ బాబు!...

బాబు వ‌ర్సెస్ బాబు!…

ఈ ఇద్ద‌రు బాబులు గ‌తంలో ఒకే పార్టీలో ఉన్నారు. ఒక‌రు పార్టీ అధినేత‌గా ఉంటే… అదే పార్టీ త‌ర‌ఫున మ‌రొక‌రు రాజ్య‌స‌భ‌కు ఎంపిక‌య్యారు. అంటే… మొద‌టి బాబుతోనే రెండో బాబు ప‌ద‌వి పొందారు. ఆ త‌ర్వాత ఏమైందో రెండో బాబు రాజ‌కీయాల‌కు స్వ‌స్తి చెప్పేశారు. త‌న పూర్వాశ్ర‌మం సినిమాల్లోకి వెళ్లిపోయారు. ఈ క‌థ జ‌రిగింది ఎప్పుడో రెండున్న‌ర ద‌శాబ్దాల క్రితం. నాటి వీరిద్ద‌రి స్నేహం ఇప్పుడు వైరంగా మారిపోయింది. ఏపీకి సంబంధించిన కీల‌క ఎన్నిక‌ల్లో వీరు ప్ర‌త్య‌ర్థులుగా మారిపోయారు. నాటి స్నేహాన్ని ప‌క్క‌న‌ప‌డేసిన వీరిద్ద‌రూ… ఇప్పుడు ప్ర‌త్య‌ర్థుల్లా పోట్లాడుకుంటున్నారు. వీరిలో మొద‌టి బాబు… టీడీపీ అధినేత‌, ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు కాగా… రెండో బాబు మాత్రం ప్ర‌ముఖ సినీ న‌టుడు, ఇటీవ‌లే వైసీపీ నేత‌గా పాలిటిక్స్ లోకి రీ ఎంట్రీ ఇచ్చిన క‌లెక్ష‌న్ కింగ్‌ మంచు మోహ‌న్ బాబు.

ఏపీలోని చిత్తూరు జిల్లాకు చెందిన వీరిద్ద‌రి వైరం ఈ ఎన్నిక‌ల్లో ప‌తాక స్థాయికి చేరింది. అయితే ఈ వైరం ఏపీకి మాత్ర‌మే ప‌రిమితం కాలేదు. పొరుగు రాష్ట్రం క‌ర్ణాట‌క‌కు కూడా పాకిపోయింది. క‌న్న‌డ‌నాట రేపు జ‌ర‌గ‌నున్న తొలి విడ‌త (దేశవ్యాప్తంగా రెండో ద‌శ‌) పోలింగ్ లో ప‌లు స్థానాల‌తో పాటు మండ్య లోక్ స‌భ స్థానానికి కూడా పోలింగ్ జ‌ర‌గ‌నుంది. ఇక్క‌డ జేడీఎస్ అభ్య‌ర్థిగా సీఎం కుమార‌స్వామి త‌న‌యుడు నిఖిల్ బ‌రిలోకి దిగ‌గా… అత‌డికి పోటీగా ప్ర‌ముఖ సినీ న‌టి, దివంగ‌త అంబ‌రీష్ స‌తీమ‌ణి సుమ‌ల‌త ఇండిపెండెంట్ గా బ‌రిలోకి దిగారు. పోటీ మామూలుగా లేదు. అంబ‌రీష్ బంధువ‌ర్గం ఎక్కువ‌గా ఉన్న ఈ స్థానంలో సుమ‌ల‌త‌కే విజ‌యావ‌కాశాలున్నాయ‌న్న వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ క్ర‌మంలో జేడీఎస్ కు మ‌ద్ద‌తుగా ప్ర‌చారానికి వెళ్లిన చంద్ర‌బాబు… నిఖిల్ ను గెలిపించాల‌ని అక్క‌డి ఓట‌ర్లకు పిలుపునిచ్చారు. ప‌రోక్షంగా సుమ‌ల‌త‌ను ఓడించాల‌ని చంద్ర‌బాబు ప్ర‌చారం చేశారు. అయితే చంద్ర‌బాబు ప్ర‌చారం చేసి వ‌చ్చిన త‌ర్వాత ట్విట్ట‌ర్ లో ఎంట్రీ ఇచ్చిన మోహ‌న్ బాబు… సుమ‌ల‌త‌కు మ‌ద్ద‌తుగా ఆసక్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. సుమ‌ల‌త‌ను గెలిపించాల‌ని అక్క‌డి ఓట‌ర్ల‌కు సందేశం పంపారు.

ఈ సంద‌ర్భంగా సుమ‌ల‌త ప్ర‌త్య‌ర్థికి మ‌ద్ద‌తుగా ప్ర‌చారం చేసిన చంద్ర‌బాబు వైఖ‌రిపై మోహ‌న్ బాబు నిప్పులు చెరిగారు. *చంద్రబాబు ఒకప్పుడు ముఖ్యమంత్రి, ఇప్పుడు కాదు, ఎప్పటికీ కాలేడు. అలాంటి వ్యక్తి కోసం నా మిత్రుడు అంబరీష్ ఎప్పుడు పిలిచినా కాదనకుండా వచ్చాడు. చంద్రబాబు నిర్వహించిన కార్యక్రమాలకు నేను రికమెండ్ చేస్తే అంబరీష్ వచ్చాడు. కానీ చంద్రబాబు ఇప్పుడా కృతజ్ఞత అనేదే లేకుండా అంబరీష్ భార్య సుమలతకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నాడు. ఆమె ఓటమికి తాను ఎంత చేయాలో అంతా చేస్తున్నాడు. సుమలతపై చంద్రబాబు వ్యతిరేక ప్రచారం చేయడం ఆశ్చర్యంతో పాటు హాస్యాస్పదంగానూ అనిపిస్తోంది” అంటూ విమర్శలు గుప్పించారు. అంటే.. ఏపీ ఎన్నిక‌ల వేదిక‌గా మొద‌లైన బాబు వ‌ర్సెస్ బాబు పోరు క‌న్న‌డ నాట‌కూ పాకింద‌న్న మాట‌.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *