‘బాబు డ్రైవర్‌ సీన్‌ కోసం తమ్ముళ్లు చాలా కష్టపడ్డారు’

‘బాబు డ్రైవర్‌ సీన్‌ కోసం తమ్ముళ్లు చాలా కష్టపడ్డారు’

సీఎం చంద్రబాబు నాయుడు ఆటో డ్రైవర్‌ సీన్‌ కోసం తెలుగు తమ్ముళ్లు చాలా కష్టపడ్డారని, ‘ఆటోలపై థ్యాంక్యూ సీఎం సార్‌’ అని అతికించడం కోసం నాలుగు లక్షల స్టిక్కర్లు చేయించి పంచిపెట్టారని, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విటర్‌ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘సైరాపంచ్‌’ యాష్‌ ట్యాగ్‌తో వరుస ట్వీట్లలో చంద్రబాబు అత్యుత్సాహాన్ని ఎద్దేవచేశారు. ‘థ్యాంక్యూ సీఎం సార్‌కు బదులు.. ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌ గారి మరో పథకం కాపీ అని పెట్టుకుంటాం సార్‌’ అని ఆటోడ్రైవర్లంటున్న ఫొటోను షేర్‌ చేశారు.

ఆటోలపై థ్యాంక్యూ సీఎం సార్ స్టిక్కర్లను అతికించడం కోసం పోలీసులు, ట్రాన్స్ పోర్టు సిబ్బంది నాలుగు లక్షల స్టిక్కర్లు చేయించి పంచి పెట్టారన్నారు. ఇసుజు కార్లకు 2021 వరకు రోడ్ ట్యాక్స్ రద్దు చేస్తూ 2016లోనే ఉత్తర్వులిచ్చారని, వందల కోట్ల ప్రయోజనం పొందిన ఆ కంపెనీ కార్ల వెనక థాంక్యూ సీఎం సార్ అని రాయించిందా? అని చంద్రబాబును నిలదీశారు. రెక్కాడితేగాని డొక్కాడని ఆటో డ్రైవర్లు మాత్రం వాహనాల వెనుక థ్యాంక్స్ చెబుతూ చంద్రబాబు ఫొటో పెట్టుకోవాలా? అని ప్రశ్నించారు.

దసరా రోజు తన ఉద్యోగులకు రూ.500 కోట్లతో కార్లు, ఫ్లాట్లు బహుమతిగా ఇచ్చిన గుజరాత్‌ వ్యాపారి సావ్జీ దొలాకియా కూడా ఇలా థాంక్యూ రాయించుకోలేదన్నారు. రూ.10 వేలకు పోస్ట్ డేటెడ్ చెక్కులు ఇచ్చి మహిళలను మీటింగులకు రమ్మని, ఫేస్ బుక్‌లో లైకులు కొట్టమని చంద్రబాబు హింసలు పెడుతున్నారని, ఇది వెట్టి చాకిరీ కంటే ఘోరమని మండిపడ్డారు. అవకాశవాదులుకు రక్తం మరిగే అవకాశమే లేదని, నాలుగేళ్లు బీజేపీకి ఊడిగం చేసినప్పుడే టీడీపీకి బానిసత్వం అలవాటని తెలిసిపోయిందన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పల్లకి మోస్తున్నారని, రాజీపడటమే జీవితంగా మారిన వారికి పౌరుషం, రక్తం సలసల కాగడాలు ఉండవని తెలిపారు. కాళ్లపై మోకరిల్లడమే ఒకటే తెలుసని ఎద్దేవా చేశారు. ఇక వైఎస్‌ జగన్‌ ప్రకటించిన నవరత్నాల్లోని ఒక్కో పథకాన్నీ కాపీకొడుతున్న చంద్రబాబు.. తాజాగా ఆటోలకు, ట్రాక్టర్లకు లైఫ్‌ట్యాక్స్‌ రద్దు చేస్తున్నట్లు ప్రకటించి మరో పథకాన్ని కాపీ కొట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *