బాబు గగ్గోలు: టీడీపీ ఆయువు 'పట్టు' అదేనా.?

బాబు గగ్గోలు: టీడీపీ ఆయువు ‘పట్టు’ అదేనా.?

ఇంటెలిజెన్స్‌ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు బదిలీ వ్యవహారం రాజకీయంగా పెనుదుమారం రేపుతోంది. ఎన్నికల కమిషన్‌ పరిధి నుంచి ఇంటెలిజెన్స్‌ విభాగాధిపతిని మినహాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఓ జీవో జారీచేయడం మరింత వివాదంగా మారింది. ప్రతిపక్షం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ‘ఆధారాలతో సహా’ ఫిర్యాదు చేయడంతో, ఐబీ చీఫ్‌ వెంకటేశ్వరరావుని తప్పిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీచేసిన విషయం విదితమే.

ఒక్క అధికారి.. ఒకే ఒక్క అధికారి విషయంలో తెలుగుదేశం పార్టీ ఇంత అత్యుత్సాహం ప్రదర్శిస్తోంటే, ప్రభుత్వానికి కాదు.. పార్టీకి అతనెంత కీలకం అన్నది అర్థమవుతోంది. ఇదే వెంకటేశ్వరరావు పేరుని ప్రస్తావిస్తూ టీడీపీనేత బుద్ధా వెంకన్న, టిక్కెట్ల కేటాయింపు వ్యవహారం గురించి నోరు జారేశారు. దేవినేని అవినాష్‌ టిక్కెట్‌ విషయమై వెంకటేశ్వరరావుతో చర్చించిందట తెలుగుదేశం పార్టీ. ఇంటెలిజెన్స్‌ విభాగాన్ని చంద్రబాబు ప్రభుత్వం ఎంత గొప్పగా వాడిందో చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి.?

ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఎక్కడా ఎలాంటి సమస్యా రాకుండా చూడటం ఎన్నికల సంఘం బాధ్యత. ఈ క్రమంలోనే దాదాపు అన్ని వ్యవస్థలపైనా ఎన్నికల కమిషన్‌ పట్టు బిగిస్తుంది. ఇంటెలిజెన్స్‌ విభాగానికి చాలా బాధ్యతలుంటాయి గనుక, ఆ విభాగం కూడా కేంద్ర ఎన్నికల సంఘం పరిధిలోనే వుండాలి. ఇంటెలిజెన్స్‌ లేకపోతే, పోలీసు వ్యవస్థలోని మిగతా విభాగాలు ఎలా పనిచేయగలుగుతాయి.? అని సాక్షాత్తూ చీఫ్‌ ఎలక్ట్రోలర్‌ అధికారి (ఆంధ్రప్రదేశ్‌) వ్యాఖ్యానించడం గమనార్హం.

వ్యవహారం కోర్టు పరిధిలోకి వెళ్ళింది గనుక.. ఏం జరుగుతుందన్నది ముందు ముందు తేలుతుంది. మరో ఇద్దరు పోలీస్‌ అధికారులపైనా బదిలీ వేటుపడినా, వెంకటేశ్వరరావు వ్యవహారమ్మీదనే చంద్రబాబు అండ్‌ టీమ్‌ తెగ ఉలిక్కి పడుతోందంటే.. వ్యవహారం తేడాగా వుందనే కదా అర్థం.!

వైఎస్సార్సీపీ, బీజేపీ మాత్రమేకాదు.. ఇప్పుడంతా టీడీపీ ఆయువు పట్టు వెంకటేశ్వరరావు చేతిలో వుందనే భావనకు వచ్చేస్తున్నారు. వెంకటేశ్వరరావు బదిలీ గనుక జరిగితే.. టీడీపీ పని ముగిసినట్లేనన్నది మెజార్టీ అభిప్రాయం. అది నిజమేనా.? టీడీపీ అత్యుత్సాహం చూస్తోంటే అలాగే అన్పిస్తోంది మరి.
Source: greatandhra

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *