బట్టతల ఉన్న వారికి జుట్టు తెప్పిస్తానన్న మోదీ!: తేజస్వీ యాదవ్ సెటైర్లు

బట్టతల ఉన్న వారికి జుట్టు తెప్పిస్తానన్న మోదీ!: తేజస్వీ యాదవ్ సెటైర్లు

ప్రధాని నరేంద్ర మోదీపై రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) అగ్రనేత తేజస్వీయాదవ్ సెటైర్లు విసిరారు. పాట్నాలో కాంగ్రెస్ పార్టీ ఈరోజు జన్ ఆక్రోశ్ ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తో పాటు తేజస్వీ యాదవ్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తేజస్వీ యాదవ్ మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల్లో బీజేపీని అధికారంలోకి రాకుండా చేసేందుకే మహాకూటమిగా ఏర్పడి పోరాడుతున్నామని అన్నారు. ఈ సందర్భంగా మోదీపై ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

2014 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయలేదని విమర్శించారు. బట్టతల ఉన్న వారికి దువ్వెనలు అమ్మిన ఘనత మోదీదని, జుట్టు లేని తమకెందుకు దువ్వెనలు అమ్ముతున్నారని వారు ప్రశ్నిస్తే, తాము అధికారంలోకి రాగానే బట్టతలపై జుట్టు తెప్పిస్తామని చెప్పి దువ్వెనలు అమ్మిన మోదీ మంచి సేల్స్ మెన్ అని సెటైర్లు విసిరారు.

దేశంలో నాటి పరిస్థితులు వేరు, ఇప్పటి పరిస్థితులు వేరని.. మోదీని నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరని అన్నారు. మోదీ అసలు రంగు గురించి బీహార్ నిరుద్యోగులకు తెలియజెప్పేందుకే రాహుల్ ఈ ర్యాలీలో పాల్గొన్నారని వ్యాఖ్యానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *