ప్రముఖ సినీ దర్శకుడు విజయ బాపినీడు కన్నుమూత!

ప్రముఖ సినీ దర్శకుడు విజయ బాపినీడు కన్నుమూత!

ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు, ‘బొమ్మరిల్లు’, ‘విజయ’, ‘నీలిమ’ పత్రికలను నడిపించిన విజయ బాపినీడు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని స్వగృహంలోనే మరణించారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు.

విజయబాపినీడు అసలు పేరు గుత్తా బాపినీడు చౌదరి. 1936, సెప్టెంబర్ 22న ఏలూరు సమీపంలోని చాటపర్రు గ్రామంలో సీతారామస్వామి, లీలావతి దంపతులకు జన్మించిన ఆయన, చిత్ర పరిశ్రమకు వచ్చి విజయ బాపినీడుగా ప్రసిద్ధి చెందారు. తెలుగులో 19 చిత్రాలకు దర్శకత్వం వహించారు. చిరంజీవి కెరీర్ కు ఎంతగానో తోడ్పడిన మగమహారాజు, మగధీరుడు, ఖైదీ నంబర్ 786, గ్యాంగ్ లీడర్ చిత్రాలకు దర్శకుడు విజయ బాపినీడే. నిర్మాతగా మారి ‘యవ్వనం కాటేసింది’ అనే చిత్రాన్ని కూడా ఆయన నిర్మించారు.

‘డబ్బు డబ్బు డబ్బు’, ‘పట్నం వచ్చిన పతివ్రతలు’, ‘మహానగరంలో మాయగాడు’, ‘హీరో’, ‘భార్యామణి’, ‘మహారాజు’, ‘కృష్ణగారడి’, ‘నాకు పెళ్ళాం కావాలి’, ‘దొంగకోళ్లు’, ‘మహారాజశ్రీ మాయగాడు’, ‘జూలకటక’, ‘మహాజనానికి మరదలు పిల్ల’, ‘బిగ్ బాస్’, ‘కొడుకులు’, ‘ఫ్యామిలీ’ చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. విజయ బాపినీడు మృతికి టాలీవుడ్ ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *