ప్రమాద బీమా.. కుటుంబానికి ధీమా

తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) తమ పార్టీ సభ్యులకు ఒక్కొక్కరికి రూ.రెండు లక్షల చొప్పున ప్రమాదబీమా సౌకర్యాన్ని అందిస్తున్నది. ఈ ఇన్సూరెన్స్ పథకం కింద మూడేండ్లలో ప్రమాదవశాత్తు చనిపోయిన 1328 మంది సభ్యుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.2 లక్షల చొప్పు న మొత్తం రూ.26.56 కోట్లు చెల్లించారు. ప్రమాదవశాత్తు పార్టీ సభ్యులు మరణిస్తే.. వారి కుటుంబాలు వీధినపడకుండా ఆదుకోవాలనే మానవతా దృక్పథంతో పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పార్టీ సభ్యులందరికీ ప్రమాదబీమా సౌకర్యాన్ని ప్రవేశపెట్టారు. ఇందుకు సంబంధించిన ప్రీమియం మొత్తాన్ని కూడా పార్టీయే చెల్లిస్తున్నది.

టీఆర్‌ఎస్ పార్టీ బీమా ప్రీమియం కింద 2015 నుంచి 2018 వరకు రూ.19.47 కోట్లు చెల్లించింది. పార్టీ సభ్యత్వ నమోదు సయమంలో సభ్యులు నామినిగా సూచించినవారికి బీమాసొమ్మును చెల్లిస్తారు. 18 నుంచి 70 ఏండ్ల వయస్సు ఉండి, టీఆర్‌ఎస్ సభ్యత్వం పొందినవారు ఈ ప్రమాదబీమాకు అర్హులు. చనిపోయిన నెలరోజుల్లో సంబంధిత పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదు చురుకుగా సాగుతున్నది. ఈ నేపథ్యంలో సభ్యత్వ పుస్తకంలో పొందుపరిచిన అన్ని వివరాలతోపాటు నామిని పేరును కూడా స్పష్టంగా నమోదుచేయాలని పార్టీ నాయకులు సూచిస్తున్నారు. ప్రమాదవశాత్తు చనిపోయినవారికి సంబంధించిన అవసరమైన అన్ని పత్రాలను నెలరోజుల్లో తెలంగాణభవన్‌లో సమర్పించాలని కోరుతున్నారు.

సమర్పించాల్సిన డాక్యుమెంట్లు
పార్టీ సభ్యత్వ నమోదుపత్రం, ఎఫ్‌ఐఆర్, డెత్ సర్టిఫికెట్, చనిపోయినవ్యక్తి ఆధార్‌కార్డు, నామిని ఆధార్‌కార్డు, ఓటరు ఐడీకార్డు, రేషన్‌కార్డు, పోలీస్ ఫైనల్‌రిపోర్ట్, దవాఖానలో చనిపోతే డెత్‌రిపోర్ట్ సమర్పించాల్సి ఉంటుంది.
Tags: Trs Party , Accident Insurance , Cm Kcr , Telangana Bhavan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *