ప్రతిపక్ష వైసీపీ నుంచి మళ్లీ జంపింగ్‌లు..

టీడీపీలోకి పలువురు ఎమ్మెల్యేలు?

నంద్యాల ఉప ఎన్నికలో ఓటమి ప్రభావం వైసీపీ నేతలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. తమ భవిష్యత్తుపై ఆందోళన రేకిత్తిస్తోంది. ఎన్నికలకు మరో రెండేళ్ల సమయం ఉండడంతో ఇప్పుడే మేలుకుంటే మంచిదనే భావన వారిలో కనిపిస్తోంది. అందులో భాగంగా పలువురు ఎమ్మెల్యేలు అధికార పార్టీ వైపు చూస్తున్నట్టు తెలుస్తోంది. నంద్యాల ఉప ఎన్నిక సందర్భంగా తమ అధినేత నంద్యాలలో ఏకంగా 13 రోజులు మకాం వేసి ప్రచారం చేసినా ఓటర్లు విశ్వసించకపోవడాన్ని చూసి వారిలో దిగులు మొదలైంది. కళ్ల ముందు భవిష్యత్తు కనిపిస్తుండడంతో టీడీపీ తప్ప మరోమార్గం లేదని భావిస్తున్నట్టు తెలుస్తోంది.

బుధవారం సచివాలయంలో ఇధ్దరు మంత్రులకు రాయలసీమకు చెందిన ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేల నుంచి ఫోన్లు రావడం ఇందుకు నిదర్శనంగా భావిస్తున్నారు. వారిద్దరూ టీడీపీలో చేరికపై ఆసక్తి కనబరిచనట్టు మంత్రులు చూచాయగా చెప్పారు. అయితే అంతకుముందు చాలా విషయాలు మాట్లాడుకోవాల్సి ఉంటుందని చెప్పడం చూస్తుంటే రాక ఖాయమనన్న విషయం స్పష్టమవుతోంది. అయితే వైసీపీ నేతలను పార్టీలో చేర్చుకునే విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోబోమని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఎన్నికల సమయంలో వైసీపీ ప్రచారం చేసినంతగా ప్రజల్లో టీడీపీపైనా, ప్రభుత్వంపైనా వ్యతిరేకత లేదన్న విషయం స్పష్టమైందని స్వయంగా వైసీపీ నేతలే చెబుతుండడం ఇందుకు మరో ఉదాహరణగా చెబుతున్నారు. మరోవైపు నంద్యాలలో గెలిచి ఉంటే బీజేపీ తమతో జత కడుతుందని వైసీపీ చీఫ్ భావించారని, ఇప్పుడా పరిస్థితి లేదని చెబుతున్నారు. కాగా, పార్టీ మారే అవకాశం ఉందని భావిస్తున్న ఎమ్మెల్యేలపై వైసీపీ అధిష్టానం ఓ కన్నేసి ఉంచినట్టు సమాచారం.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *