పాపవ్వకు కన్నీటి వీడ్కోలు

పాపవ్వకు కన్నీటి వీడ్కోలు

రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి మాతృమూర్తి పరిగె పాపవ్వ (107) అంత్యక్రియలు అశ్రునయనాల మధ్య ముగిశాయి. బుధవారం మధ్యాహ్నం రెండు గంటలకు కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం పోచారం శివారులోని సభాపతి వ్యవసాయ భూమిలో ఆమె చిన్న కొడుకు, శ్రీనివాస్‌రెడ్డి సోదరుడు పరిగె శంభిరెడ్డి చితికి నిప్పంటించారు. పాపవ్వ మనుమలు పరిగె రవీందర్‌రెడ్డి, సురేందర్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, వినోద్‌రెడ్డి తమ నానమ్మ పాడెమోసి తుది వీడ్కోలు పలికారు. స్పీకర్ తల్లి మరణవార్తను తెలుసుకున్న పలువురు ప్రముఖులు పోచా రం గ్రామానికి తరలివచ్చి కుటుంబసభ్యులను పరామర్శించారు. పాపవ్వ మృతి వార్త తెలిసిన వెంటనే సీఎం కేసీఆర్‌తోపాటు, హోం మంత్రి మహమూద్‌అలీ, మాజీ స్పీకర్ మధుసూదనాచారి, రైతు సమన్వయ సమితి రాష్ట్ర చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు ఫోన్‌లో శ్రీనివాస్‌రెడ్డిని పరామర్శించారు.
మాజీ మంత్రులు జీ జగదీశ్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, ఎంపీ బీబీ పా టిల్, ఎమ్మెల్యేలు హన్మంత్‌షిండే, గంప గోవర్ధన్, ఏ జీవన్‌రెడ్డి, షకీల్ అహ్మద్, గణేశ్‌గుప్తా, ఎమ్మెల్సీలు వీ గోవర్ధన్‌గౌడ్, రాజేశ్వర్, మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ దఫేదార్ రాజు, అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు, రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థ చైర్మన్ లోక భూమారెడ్డి, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల కలెక్టర్లు ఎన్ సత్యనారాయణ, ఎంఆర్‌ఎం రావు, నిజామాబాద్ డీఐజీ శివశంకర్‌రెడ్డి, నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్తికేయ, జిల్లా, స్థానిక నాయకులు పాపవ్వ పార్థివదేహానికి నివాళులర్పించారు. వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి సీ పార్థసారథి, సీడ్ కార్పొరేషన్ డైరెక్టర్ కే కేశవులు, తెలంగాణ అగ్రిడాక్టర్స్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు రాములు, అధ్యక్షుడు రాజరత్నం, ప్రధాన కార్యదర్శి ప్రతాప్ తదితరులు పాపవ్వ మృతిపట్ల దిగ్భ్రాంతిని వ్యక్తంచేశారు. పోచారం నివాసానికి వెళ్లినప్పు డు పాపవ్వతో ఉన్న చొరవను గుర్తుచేసుకున్నారు.

పాపవ్వకు జన నీరాజనం
పోచారం మాతృమూర్తి పాపవ్వ అంతిమయాత్రకు పోచారం గ్రామస్తులు, బంధువులు భారీగా తరలివచ్చారు. మనుమలు, మనుమరాళ్లు పాపవ్వను కడసారి చూసి, కన్నీరు మున్నీరయ్యారు. ప్రముఖులు, సామాన్య ప్రజల తాకిడితో పోచారం గ్రామం కిక్కిరిసినట్లయింది. శ్రీనివాస్‌రెడ్డి స్వగృహం నుంచి వ్యవసాయక్షేత్రం వరకు అంతిమయాత్ర సాగగా.. పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వెంటకదిలివచ్చారు. పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లుచేశారు.
నేడు పోచారం గ్రామానికి సీఎం కేసీఆర్
రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి మాతృమూర్తి పాపవ్వ (107) మృతి పట్ల ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సంతాపం వ్యక్తంచేశారు. ఆమె మృతి వార్త తెలిసినవెంటనే స్పీకర్‌ను సీఎం ఫోన్‌లో పరామర్శించారు. సభాపతిని, ఆయన కుటుంబసభ్యులను పరామర్శించేందుకు గురువారం పోచారం గ్రామానికి వెళ్లనున్నారు. ఉదయం పది గంటలకు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి బాన్సువాడకు చేరుకుంటారు. అక్కడనుంచి రోడ్డుమార్గంలో నేరుగా పోచారం స్వగృహానికి వెళ్లి.. స్వర్గీయ పాపవ్వ చిత్రపటానికి శ్రద్ధాంజలి ఘటిస్తారు. అనంతరం స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఆయన కుటుంబీకులను కలిసి సానుభూతి వ్యక్తంచేస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *