పట్టాలు తప్పిన సీమాంచల్

బీహార్‌లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఢిల్లీలోని ఆనంద్ విహార్ టెర్మినల్ నుంచి బీహార్‌లోని జోగ్బని మధ్య నడిచే సీమాంచల్ ఎక్స్‌ప్రెస్ ఆదివారం తెల్లవారుజామున నాలుగు గంటలకు వైశాలి జిల్లాలో ప్రమాదానికి గురైంది. మొత్తం 11 బోగీలు పట్టాలు తప్పడంతో పెను విషాదం చోటుచేసుకుంది. ప్రయాణికులంతా గాఢనిద్రలో ఉన్న సమయంలో ఈ ప్రమాదం జరుగడంతో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. 29 మంది తీవ్రంగా గాయపడ్డారు. మరో 21 మందికి సాధారణ గాయాలయ్యాయి. సోన్‌పూర్ డివిజన్ షహదాయ్ బుజుర్గ్ ప్రాంతంలో రైలు పట్టాలు తప్పింది. మూడు స్లీపర్ క్లాస్, ఒక జనరల్, ఒక ఏసీ, మరో ఆరు సాధారణ బోగీలు పట్టాలు తప్పాయి. తీవ్రంగా గాయపడిన వారిని వెంటనే సమీపంలోని దవాఖానలకు తరలించాం. అపస్మారక స్థితిలోకి వెళ్లిన పలువురిని ముజఫర్‌పూర్, పాట్నాలకు తరలించాం అని తూర్పు మధ్య రైల్వే జోన్ చీఫ్ పీఆర్‌వో తెలిపారు. మృతుల్ని ఇచ్ఛాదేవి (66), ఇందిరాదేవి (60), శంషుద్దీన్ ఆలం (26), అన్సార్ ఆలం (19), సైదా ఖాతూన్ (40), సుదర్శన్‌దాస్ (60)గా గుర్తించారు. మరోవైపు సీమాంచల్ ఎక్స్‌ప్రెస్ ప్రమాద వార్తపై రైల్వే మంత్రి పీయూష్ గోయెల్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ప్రమాదంలో మృతిచెందిన వారికి రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా, తీవ్రంగా గాయపడిన వారికి రూ.లక్ష, సాధారణ గాయాలైన వారికి రూ.50వేల పరిహారం అందించనున్నట్లు ప్రకటించారు.
ప్రమాద వార్త తెలియగానే ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యల్లో పాల్గొన్నారని ఆయన పేర్కొన్నారు. గ్యాస్ కట్టర్‌లతో బోగీల్లో చిక్కుకున్న ప్రయాణికులను రక్షించినట్లు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తునకు ఆదేశించినట్లు మంత్రి చెప్పారు.

రైలు ప్రమాదం జరిగిన ప్రాంతం సోనేపూర్, బరౌని పట్టణాలకు అత్యంత సమీపంలో ఉండడంతో అటు స్థానికులు, ఇటు పోలీసులు, వైద్యులు సకాలంలో సహాయక చర్యల్లో పాల్గొనడంతో ప్రాణనష్టం తగ్గిందని బీహార్ సీఎం నితీశ్‌కుమార్ వెల్లడించారు. స్థానిక జిల్లా కలెక్టర్, అధికార యంత్రాంగం బాధితులకు సేవలందిస్తున్నారని తెలిపారు. ప్రమాదానికి గురికాని బోగీల్లో 500 మంది ప్రయాణికులున్నారు. వీరిని ప్రత్యేక బస్సుల్లో హాజీపూర్‌కు తరలించారు.

ప్రయాణికులకు ఆహారం, ఇతర సౌకర్యాలను రైల్వే అధికారులు కల్పించారు. రైలు పట్టాల్లో ఏర్పడిన పగుళ్ల వల్లే ప్రమాదం జరిగినట్లు రైల్వేశాఖ ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు తెలిసింది. కానీ, రైల్వేశాఖ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని వివిధ పార్టీల నేతలు ఆరోపించారు. మోదీ హయాంలో ప్రయాణికుల భద్రత గాలిలో దీపంలా మారిందని లోక్‌తాంత్రిక్ జనతాదళ్ నేత శరద్‌యాదవ్ విమర్శించారు. రైల్వే మంత్రి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

బాంబు పేలినట్లుగా భారీ శబ్దం వినిపించింది
రైలు ప్రమాద సమయంలో బాంబు పేలినట్లుగా భారీ శబ్దం వినిపించిందని ప్రత్యక్షసాక్షి, ప్రయాణికురాలు ఇమారతి దేవి చెప్పారు. కిషన్‌గంజ్ స్టేషన్‌లో నేను, మా అత్త రైలులో ఎక్కాం. ఆ తర్వాత నిద్రించేందుకు ఏర్పాట్లు చేస్తుండగానే ఒక్కసారిగా భారీ శబ్దం వినిపించింది. బాంబు పేలుడేమోనని అనుకున్నాను. ఇంతలో రైలు బలంగా భూమిని తాకింది. నేను ఎగిరి కిందపడిపోయాను. నా పక్క సీట్లలో వారికి తీవ్ర గాయాలయ్యాయి. కొందరు ప్రయాణికులు రైలు కిటికీలు విరగొట్టి బయటపడ్డారు అని ఆమె వివరించారు. సీమాంచల్ రైల్వే ప్రమాదంపై ప్రధాని నరేంద్రమోదీ, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ తీవ్ర విచారం వ్యక్తంచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *