Citizenship, Amendment Bill, Rajya Sabha,NDA UPA

నేడు రాజ్యసభకు పౌరసత్వ బిల్లు… సభలో పార్టీల బలాబలాల వివరాలు!

బిల్లు పాస్ కావాలంటే మేజిక్ ఫిగర్ 121
ఎన్డీయే సంఖ్యాబలం 130
శివసేన దూరంగా ఉన్నా బీజేపీకి వచ్చే నష్టం ఏమీ లేదు
బీజేపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పౌరసత్వ సవరణ బిల్లు లోక్ సభ ఆమోదం పొందింది. ఈ రోజు మధ్యాహ్నం ఈ బిల్లు రాజ్యసభకు రాబోతోంది. ఈ నేపథ్యంలో, బిల్లును ఆమోదింపజేసుకోవడానికి ఎన్డీయే, వీగిపోయేలా చేసేందుకు యూపీఏలు కసరత్తు చేస్తున్నాయి. ఈ తరుణంలో, రాజ్యసభలో ఇరు పక్షాల సంఖ్యాబలం ఎంతుందో తెలుసుకుందాం.

రాజ్యసభలో ప్రస్తుతం ఉన్న మొత్తం సంఖ్యాబలం 240. ఈ బిల్లు పాస్ కావాలంటే మేజిక్ ఫిగర్ 121. ఎన్డీయేలో బీజేపీతో కలిపి అన్నాడీఎంకే, జేడీయూ, అకాలీదళ్ సంఖ్యాబలం 116గా ఉంది. మరో 14 మంది తమకు మద్దతు పలుకుతారనని బీజేపీ భావిస్తోంది. ఇదే జరిగితే 130 మంది సభ్యుల మద్దతుతో ఈ బిల్లు సునాయాసంగా గట్టెక్కుతుంది. మిగిలిన 14 మంది సభ్యుల్లో శివసేనకు చెందిన ముగ్గురు, నవీన్ పట్నాయక్ కు చెందిన బీజేడీ సభ్యులు ఏడుగురు, వైసీపీకి చెందిన ఇద్దరు, టీడీపీకి చెందిన ఇద్దరు సభ్యులు ఉన్నారు. ఈ నేపథ్యంలో, ఒకవేళ ఓటింగ్ కు శివసేన దూరంగా ఉన్నప్పటికీ… బీజేపీకి వచ్చిన సమస్య ఏమీ ఉండదు.

యూపీఏ విషయానికి వస్తే… ప్రస్తుతం ఈ కూటమికి 64 మంది సభ్యులు ఉన్నారు. ఈ బిల్లును టీఎంసీ, టీఆర్ఎస్, సమాజ్ వాదీ పార్టీ, సీపీఐ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. వీటి సంఖ్యాబలం 46గా ఉంది. ఈ మొత్తం సంఖ్య 110 మాత్రమే ఉండటంతో… బిల్లు వీగిపోయే అవకాశం ఏమాత్రం లేదు. దీంతో, ఈరోజు రాజ్యసభలో బిల్లు గట్టెక్కబోతోందనే చెప్పవచ్చు.
Tags: Citizenship, Amendment Bill, Rajya Sabha,NDA UPA

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *