నిన్నటి చర్చను పొడిగిద్దాం… ప్రజలు చూస్తారు… అసెంబ్లీలో టీడీపీకి వైఎస్ జగన్ పంచ్!

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల రెండో రోజు ప్రారంభంలోనే ఆసక్తికర పరిణామం జరిగింది. నిన్న రైతులకు సున్నా వడ్డీపై జరిగిన వాడివేడి చర్చ అనంతరం సీఎం జగన్ సమాధానంతో సభ ముగియగా, ఈ ఉదయం సభ ప్రారంభంకాగానే, టీడీపీ నేత అచ్చెన్నాయుడు, అదే చర్చను కొనసాగించాలని, తమకు కొన్ని అనుమానాలు ఉన్నాయని, వాటిని నివృత్తి చేయాల్సిందేనని పట్టుబట్టారు. ప్రశ్నోత్తరాల సమయంలో దీనికి అనుమతించేది లేదని, పైగా బడ్జెట్ కూడా ప్రవేశపెట్టాల్సి వుందని, మరో రూపంలో నోటీసులు ఇవ్వాలని స్పీకర్ తమ్మినేని సీతారాం చెప్పినా టీడీపీ సభ్యులు వినలేదు. వారు నినాదాలు చేస్తున్న వేళ, సభా నాయకుడు, సీఎం వైఎస్ జగన్ మైక్ ను తీసుకుని, నిన్నటి చర్చను పొడిగించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, చంద్రబాబునాయుడు ఏం చెప్పదలచుకున్నారో చెప్పవచ్చని అన్నారు. తమ వద్ద అన్ని గణాంకాలూ సిద్ధంగా ఉన్నాయని, సభలో మరికాసేపు అదే అంశంపై చర్చ జరిగితే ప్రజలు కూడా చూస్తారని అంటూ టీడీపీకి చురకలు అంటించారు. కాగా, ఇలా ముగిసిన అంశాన్ని తిరిగి తోడటం సభా సంప్రదాయాలకు విరుద్ధమని, ముఖ్యమంత్రి మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారని, అందుకు మరోసారి సమయం ఇస్తానని స్పీకర్ తేల్చి చెప్పారు.

‘నవరత్నాల బడ్జెట్’కు జగన్ కేబినెట్ ఆమోదం

2019-20 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వార్షిక బడ్జెట్ కు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన కేబినెట్ కొద్దిసేపటి క్రితం ఆమోదం పలికింది. మరికాసేపట్లో బడ్జెట్ ప్రతిపాదనలు అసెంబ్లీ ముందుకు రానున్న నేపథ్యంలో, ఈ ఉదయం సచివాలయానికి వచ్చిన జగన్, తన మంత్రివర్గ సహచరులతో సమావేశమై, కొత్త బడ్జెట్ కు ఆమోదం పలికారు. ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన నవరత్నాల అమలుపైనే ఈ బడ్జెట్ ప్రధానంగా ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది. కాగా, బడ్జెట్ ప్రతిపాదనలను ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, అసెంబ్లీలో సమర్పించనున్నారు. ఆపై వ్యవసాయ బడ్జెట్ ను మరో మంత్రి మోపిదేవి వెంకటరమణ ప్రవేశపెడతారు.
Tags: Andhra Pradesh, Budget,Jagan,Cabinet,Andhra Pradesh,Assembly,Tammineni,Telugudesam, Jagan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *