నరసరావుపేట రౌడీలతో కోడెల ఇనిమెట్ల పోలింగ్ బూత్ లోకి ఎందుకొచ్చారు?: అంబటి రాంబాబు ప్రశ్న

నరసరావుపేట రౌడీలతో కోడెల ఇనిమెట్ల పోలింగ్ బూత్ లోకి ఎందుకొచ్చారు?: అంబటి రాంబాబు ప్రశ్న

కోడెల నేరస్వభావం ఉన్న వ్యక్తి
ఓడిపోతానన్న భయంతోనే గందరగోళం సృష్టించారు
గుంటూరులో మీడియాతో వైసీపీ నేత
టీడీపీ నేత, ఏపీ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు క్రిమినల్ స్వభావం కలిగిన వ్యక్తి అని వైసీపీ నేత అంబటి రాంబాబు విమర్శించారు. తాను గెలవడం కోసం ఎంతకైనా బరితెగించే చరిత్ర కోడెలదని దుయ్యబట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతానన్న భయంతోనే కోడెల ఇనిమెట్లలోని పోలింగ్ కేంద్రంలో గందరగోళం సృష్టించారని ఆరోపించారు. గుంటూరు జిల్లాలోని వైసీపీ కార్యాలయంలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో అంబటి మాట్లాడారు.

ఓటర్లను బెదిరించడం, బూత్ క్యాప్చరింగ్ కు పాల్పడటం కోడెలకు అలవాటేనని అంబటి రాంబాబు వ్యాఖ్యానించారు. ఇనిమెట్లలో కోడెల రిగ్గింగ్ కు పాల్పడుతున్నారనే అసలు గొడవ ప్రారంభమయిందని అంబటి తెలిపారు. ఇనిమెట్ల ప్రజలను పోలీసులతో బెదిరించాలని చూస్తే ఊరుకోబోమని హెచ్చరించారు.

తాము ఇనిమెట్ల గ్రామానికి వెళ్లకపోయినా తమపై అన్యాయంగా కేసులు పెట్టారన్నారు. నరసరావుపేట రౌడీలతో కోడెల ఇనిమెట్ల పోలింగ్ బూత్ కు ఎందుకు వచ్చారు? అని అంబటి ప్రశ్నించారు. కోడెల రిగ్గింగ్ కు పాల్పడ్డారని తాము ఫిర్యాదు చేసినా పోలీసులు ఇంతవరకూ కేసు పెట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈసారి భారీ మెజారిటీతో వైసీపీ అధికారంలోకి రాబోతోందని జోస్యం చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *