‘నటి శ్రీదేవి చనిపోలేదు.. చంపేశారు’ అంటున్న కేరళ మాజీ డీజీపీ

నటి శ్రీదేవి మరణంపై సంచలన విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. దుబాయ్‌లో ఓ వేడుకకు హాజరైన శ్రీదేవి గతేడాది ఫిబ్రవరి 24న బాత్‌టబ్‌లో మునిగి ప్రాణాలు కోల్పోయింది. అప్పట్లో ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమైంది. ఆమెను హత్య చేశారన్న వార్తలు అప్పట్లో పెను సంచలనమయ్యాయి. అయితే, దుబాయ్ ఫోరెన్సిక్ నిపుణులు మాత్రం ఆమె‌ బాత్‌టబ్‌లో మునిగిపోవడం వల్లే మరణించిందని తేల్చి ఊహాగానాలకు పుల్‌స్టాప్ పెట్టారు.

అయితే, ఒడ్డుపొడుగు బాగున్న ఓ వ్యక్తి చిన్నపాటి బాత్‌టబ్‌లో పడి మ‌ృతి చెందడం ఏంటన్న ప్రశ్నలు ఇప్పటికీ అభిమానుల మదిని తొలిచేస్తున్నాయి. ఏడాది దాటినా అవి ముసురుకుంటూనే ఉన్నాయి. తాజాగా, శ్రీదేవి మరణంపై సంచలన విషయం ఒకటి బయటకు వచ్చింది. శ్రీదేవి చనిపోలేదని, ఆమెను చంపేశారని, ఆమె మరణం వెనక కుట్ర కోణం దాగి ఉందని కేరళ జైళ్ల శాఖ మాజీ డీజీపీ రిషిరాజ్‌ సింగ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ దినపత్రికకు ఆయన రాసిన వ్యాసంలో శ్రీదేవి మునిగి చనిపోయి ఉండకపోవచ్చని పేర్కొన్నారు.

ఈ విషయాన్ని తాను అల్లాటప్పాగా చెప్పడం లేదని, ఫోరెన్సిక్ నిపుణుడైన తన స్నేహితుడు ఉమా దత్తన్ తనతో ఆ విషయం పంచుకున్నారని తెలిపారు. ఓ మనిషి ఎంత మద్యం తీసుకున్నా, ఎంతగా మత్తులో మునిగి తేలినా అడుగు లోతు ఉండే నీటి తొట్టెలో పడి చనిపోవడం అసాధ్యమన్నారు. శ్రీదేవి కాళ్లను ఒకరు గట్టిగా పట్టుకుంటే మరొకరు ఆమె తలను నీటిలో ముంచి చంపేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. అలా జరిగి ఉంటే తప్ప శ్రీదేవి చనిపోయే అవకాశం లేదని ఉమా దత్తన్ తనతో చెప్పారని, అయితే, ఈయన ప్రస్తుతం మన మధ్య లేరని, ఇటీవలే మరణించారని తెలిపారు.

శ్రీదేవి మరణంపై వస్తున్న కుట్ర కోణం వార్తలను ఆమె భర్త బోనీ కపూర్ ఖండించారు. ఇవన్నీ ఊహాజనితమేనని కొట్టిపడేశారు. ఆధారాలు లేని ఇటువంటి వార్తలకు స్పందించాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పారు. ఇటువంటి మూర్ఖపు వాదనలను ఎవరో ఒకరు చేస్తూనే ఉంటారని తీసిపడేశారు.
Tags: Bollywood, Sridevi,Boney Kapoor,Dubai

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *