దేవునికొండకేదీ అండ?

చారిత్రక విధ్వంసానికి సిద్ధమవుతున్న అధికార గణం
గ్రానైట్‌ కోసం 1300 ఏళ్ల చరిత్రకు చరమగీతం
తాజాగా బయటపడిన జైనతీర్థంకరుడి విగ్రహం
కోట్లనర్సింహులపల్లిలో రాష్ట్రకూటుల నాటి ఆలయం, కోటలకు ముప్పు
కొండను గుత్తేదారుకు కట్టబెట్టేందుకు రంగం సిద్ధం
ఆగమేఘాల మీద దస్త్రాన్ని సిద్ధం చేసిన గనుల శాఖ
కొండను వారసత్వ సంపదగా ప్రకటించాలంటున్న స్థానికులు
అదో చారిత్రక ప్రాంతం.. అక్కడ అడుగు తీసి అడుగేస్తే ఏదో ఒక చారిత్రక సాక్ష్యం స్వాగతం పలుకుతున్నట్లుగా అనిపిస్తుంటుంది.. అటువంటి అద్భుత వారసత్వ సంపద విధ్వంసానికి పథక రచన జోరుగా సాగుతోంది. 79 ఎకరాల్లో విస్తరించి ఉన్న శతాబ్దాల నాటి చరిత్రను గ్రానైట్‌ రాళ్ల కోసం కాలగర్భంలో కలిపేందుకు గనుల శాఖలో దస్త్రం శరవేగంగా కదులుతోంది. ఇప్పటికే అక్కడ అనేక గ్రానైట్‌ కొండలు, వాటితో పాటే చరిత్రా కనుమరుగైపోయాయి. మిగిలి ఉన్న ఒకే ఒక్క కొండనూ కొందరి స్వార్థ ప్రయోజనాల కోసం పేల్చివేయాలనే ఆలోచన రావడమే దారుణం. కరీంనగర్‌ జిల్లా గంగాధర మండలం కోట్లనర్సింహులపల్లిలోని కొండను గ్రానైట్‌ క్వారీగా మార్చడానికి అధికార గణాలు సిద్ధమయ్యాయి. ‘ఈనాడు’ ప్రతినిధి ఆ కొండపై, చుట్టుపక్కల ప్రాంతాల్లో పరిశీలించినప్పుడు అనేక ఆసక్తికర అంశాలను గుర్తించారు. 1300 ఏళ్లనాటి లక్ష్మీనర్సింహస్వామి ఆలయం, కోట తదితరాలన్నీ భావితరాలకు పదిలపర్చడం పాలకుల కర్తవ్యం.

కరీంనగర్‌ జిల్లాలోని గంగాధర, రామడుగు, బోయినపల్లి, మల్యాల మండలాలు నాణ్యమైన గ్రానైట్‌ రాళ్లకు ప్రసిద్ధి. గ్రానైట్‌ రాయి లాభాలను ఆర్జించిపెడుతుండడంతో కొన్నేళ్లుగా పలువురి కన్ను వీటిపై పడింది. పలు గుట్టలను ఇప్పటికే మింగేశారు. గంగాధర మండలంలో ఇప్పుడు మిగిలింది రెండే కొండలు. అందులో ఒకటి జైన స్థావరంగా వర్ధిల్లిన బొమ్మలగుట్ట. దాన్ని కాపాడుకోవడానికి ప్రజలు పోరాటాలు చేయాల్సి వచ్చింది. మిగిలింది కోట్లనర్సింహులపల్లిలో 79 ఎకరాల్లో విస్తరించి ఉన్న ‘దేవుని కొండ’. ఇప్పుడు కొందరు పెద్దల కన్ను దీనిపై పడింది. కొండపై పురాతన ఆలయాలతో పాటు ఇప్పటికీ ఛేదించని రహస్యాలెన్నో ఉన్నాయి. అటువంటి కొండను ఆరుగురు గుత్తేదార్లకు ధారాదత్తం చేసేందుకు గనుల శాఖ ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఈ శాఖలో దస్త్రాలు కదిలిన తీరును పరిశీలిస్తే.. చరిత్ర ధ్వంసమైపోయినా సరే కొండను గుత్తేదార్లకు ఇచ్చేయడమే లక్ష్యమనే ధోరణి అధికారగణాల్లో కనిపిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *