తొలిసారిగా గూగుల్ మ్యాప్స్ లో గణేశ్ ‘శోభాయాత్ర’!

హైదరాబాద్ లో గణేశ్ నిమజ్జన శోభాయాత్రకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు ఉదయం నుంచి నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలు అమలులోకి రానున్నాయని పోలీసు అధికారులు వెల్లడించారు. జీహెచ్ఎంసీ, గణేశ్ ఉత్సవ సంఘాలతో కలిసి నిమజ్జనం సజావుగా సాగేందుకు అన్ని రకాల చర్యలనూ తీసుకున్నామని అధికారులు తెలిపారు. ప్రతి 3 కి.మీ.లకు ఒక గణేశ్‌ యాక్షన్‌ టీమ్‌ ఉంటుందని, వివిధ విభాగాలతో జీహెచ్‌ఎంసీ కలిసి పనిచేస్తోందని అన్నారు. విద్యుత్, శానిటేషన్, జలమండలి, ఫైర్, పోలీస్‌ తదితర శాఖల సిబ్బందిని పూర్తి స్థాయిలో రంగంలోకి దించామని వెల్లడించారు.

ఇక నిమజ్జనం అంటే అందరికీ గుర్తుకు వచ్చేది ఖైరతాబాద్ లో కొలువుదీరే మహా గణపతి. రేపు ఉదయం 7 గంటలకల్లా మహా గణపతి నిమజ్జన యాత్ర ప్రారంభం అవుతుందని, ఆపై మధ్యాహ్నంలోగా నిమజ్జనం పూర్తవుతుందని మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ తెలిపారు. ఈ దఫా తొలిసారిగా గూగుల్ మ్యాప్స్ లో గణేశ్ శోభాయాత్ర కనిపిస్తుందని, నిమజ్జనం పూర్తయ్యే వరకు ఆ మార్గాన్ని గూగుల్ చూపిస్తుందని అన్నారు.

ఇక నిమజ్జనానికి వచ్చే సందర్శకుల కోసం ప్రత్యేక పార్కింగ్‌ ఏర్పాట్లు చేశామని, ఊరేగింపు, ట్రాఫిక్‌ స్థితిగతులను ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తామని అధికారులు తెలిపారు. ప్రత్యేక హెల్ప్‌లైన్స్‌ ఏర్పాటు చేశామని అన్నారు.
Tags: hyd ganesh utsav,ganesh immarsion , tank bund

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *