తరలివస్తోన్న తెలుగు చిత్ర పరిశ్రమ

తరలివస్తోన్న తెలుగు చిత్ర పరిశ్రమ

తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు, నటులు జగన్‌కు జై కొడుతున్నారు. వారంతా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరడంతో టీడీపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి. సినీ పరిశ్రమపై టీడీపీ పట్టు కోల్పోవడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. రోజా, విజయ్‌చందర్‌ వంటి సీనియర్‌ నటులు మొదట్నుంచీ వైఎస్సార్‌సీపీలోనే ఉన్నారు. వీరితో పాటు పోసాని కృష్ణమురళీ తదితరులు పార్టీ తరఫున తమ గళం విన్పించేవారు.

ఇటీవల ప్రముఖ హాస్యనటుడు పృథ్వీ, మరో నటుడు కృష్ణుడు చేరారు. తర్వాత సీనియర్‌ నటి జయసుధ, మరో ప్రముఖ హాస్యనటుడు అలీ, భానుచందర్, దాసరి అరుణ్‌కుమార్, చిన్ని కృష్ణ, రాజారవీంద్ర, తనీష్‌ వైఎస్సార్‌సీపీ కండువా కప్పుకున్నారు. దర్శకుడు ఎస్‌వీ కృష్ణారెడ్డి, నిర్మాత అచ్చిరెడ్డి తదితరులు జగన్‌కు మద్దతు పలికారు. తాజాగా ప్రముఖ నటుడు మోహన్‌బాబు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు.

ఎన్నికలు దగ్గరపడే కొద్దీ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి చేరికలు జోరుగా సాగుతున్నాయి. సోమవారం రాజశేఖర్, జీవిత, హేమ, టీవీ యాంకర్‌ శ్యామల దంపతులు జగన్‌ సమక్షంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. వీరంతా టీడీపీకి వ్యతిరేకంగా గళం విప్పడంతో పాటు, జగన్‌కు ఒక్కసారి ముఖ్యమంత్రి అవకాశం ఇవ్వాలని తమ అభిమానులకు, ప్రజలకు విజ్ఞప్తి చేయడంతో టీడీపీ ఆందోళన చెందుతుంది.

టీడీపీ, జనసేనను కాదని..
మొదట్నుంచి సినీ నేపథ్యం ఎక్కువగా ఉన్న తెలుగుదేశాన్ని, టాలీవుడ్‌ హీరో పవన్‌ కల్యాణ్‌ స్థాపించిన జనసేనను కాదని నటులు, దర్శకులు, నిర్మాతలు వైఎస్సార్‌సీపీలోకి రావడం గమనార్హం. కొద్దికాలం క్రితం వరకూ టాలీవుడ్‌పై టీడీపీ ప్రభావం ఎక్కువగా ఉండేది. కొందరు బాహాటంగానే చంద్రబాబుకు మద్దతు పలికారు. రాఘవేంద్రరావు, అశ్వనీదత్‌ వంటి సినీ పెద్దలైతే సినీ పరిశ్రమ మొత్తం మీ వెంట ఉంటుందని చంద్రబాబుకు హామీ ఇచ్చారు. దీనిపై పోసాని కృష్ణమురళీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డులు సినీ పరిశ్రమలో చిచ్చురేపాయి. చంద్రబాబు కేవలం తన వర్గానికి చెందిన వారికే అవార్డులిచ్చారనే విమర్శలు వెల్లువెత్తాయి. ఏపీలో ఆధార్‌ లేని వాళ్లు మాట్లాడుతున్నారంటూ అప్పట్లో సీఎం కుమారుడు లోకేష్‌ అనడంపై విమర్శలు వెల్లువెత్తాయి. చంద్రబాబుకు మద్దతు పలికే సినీ ప్రముఖులెవరూ ఆ సమయంలో నోరు మెదపలేదు. మరోవైపు చిన్న సినిమాల విడుదలకు టీడీపీ ఏమాత్రం సహకారం అందించలేదు.

తన కుటుంబంలోని జూనియర్‌ ఎన్టీఆర్‌ సినిమాలకు థియేటర్లు దక్కకుండా చేసేందుకు లోకేశ్‌ ప్రయత్నాలు చేశారు. ఏపీలో సినీ పరిశ్రమకు మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇవన్నీ టీడీపీపై వ్యతిరేకత పెంచేందుకు కారణమయ్యాయి.

సినీనటుల్ని కించపర్చేలా టీడీపీ వ్యాఖ్యలు
ఎన్నికల సమయంలో టీడీపీ నాయకులు పరిశ్రమ మొత్తాన్ని కించపర్చేలా ఎదురుదాడికి దిగారు. కేసీఆర్‌ వారితో మాట్లాడిస్తున్నారని, హైదరాబాద్‌లో ఆస్తులు కాపాడుకునేందుకే విమర్శిస్తున్నారని రకరకాల ఆరోపణలు చేశారు. వీటిపై టాలీవుడ్‌ నటులు మండిపడుతున్నారు.

Tags: Andhra Pradesh, Election 2019,telugu film industry,YSRCPRK, roja,Jeevitha, Rajasekhar

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *