తడిసి ముద్దవుతున్న తెలుగు రాష్ట్రాలు.. నేడు, రేపు కూడా వానలే!

తెలుగు రాష్ట్రాలు తడిసి ముద్దవుతున్నాయి. గత రెండు రోజులుగా ఆగకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. చెరువులు నిండి కళకళలాడుతున్నాయి. పలు ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. బంగాళాఖాతం ఈశాన్య ప్రాంతంలో నేడు అల్ప పీడనం ఏర్పడే అవకాశం ఉందని, దీని ప్రభావంతో తెలంగాణలో మరో నాలుగైదు రోజులు తేలికపాటి వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో నేడు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.

శుక్రవారం తెలంగాణలో పలు చోట్ల కుంభవృష్టి పడింది. గరువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు తెలంగాణలోని ములుగు వెంకటాపూర్‌లో 22 సెంటీమీటర్ల వర్షం కురిసింది. అలాగే, శుక్రవారం ఉదయం 8 నుంచి రాత్రి 8 వరకు 554 ప్రాంతాల్లో వానలు పడ్డాయి. శుక్రవారం పగటిపూట అత్యధికంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్‌లో 7.1 సెం.మీ.ల వర్షం కురిసింది.

గురువారం ఉదయం నుంచి జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్‌ రూరల్ జిల్లాల్లో వర్షం ఎడతెరిపి లేకుండా కురుస్తూనే ఉంది. మరోవైపు, వర్షాల కారణంగా భద్రాచలం వద్ద గోదావరి వరద ఉగ్రరూపం దాల్చింది. గత రాత్రి 9 గంటలకు నీటిమట్టం 41.80 అడుగులకు చేరుకుంది. మరోవైపు, ఏపీలోనూ విస్తారంగా వానలు కురుస్తున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో కొన్ని చోట్ల శుక్రవారం భారీ వర్షం కురిసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *