టీఆర్‌ఎస్‌ నేతలు పగటి కలలు కనడం మానేయాలి: బీజేపీ నేత కిషన్‌రెడ్డి

టీఆర్‌ఎస్‌ నేతలు పగటి కలలు కనడం మానేయాలి: బీజేపీ నేత కిషన్‌రెడ్డి

తెలంగాణ రాష్ట్రంలో 16 మంది ఎంపీలను గెలిపిస్తే ఢిల్లీలో కేసీఆర్‌ చక్రం తిప్పుతారని టీఆర్‌ఎస్‌ నేతలు అనడం విడ్డూరంగాను, హాస్యాస్పదంగానూ ఉందని బీజేపీ నేత కిషన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. ప్రస్తుతం 15 మంది ఎంపీలుంటే ఏం చేశారో ఒకసారి తెలంగాణ ప్రజలకు వివరంగా చెప్పాలని కోరారు. పలు ముస్లిం దేశాలు, విదేశాల నుంచి తనను చంపుతామని బెదిరింపు కాల్స్‌ వస్తున్నాయని మంగళవారం ఆయన ఢిల్లీలో కేంద్రహోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కలిసి ఫిర్యాదు చేశారు.

ఈ సందర్భంగా తెలంగాణ భవన్‌ ఆవరణలో ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. టీఆర్‌ఎస్‌ నేతలు పగటి కలలు కనడం మానేయాలని, మళ్లీ ప్రధాని పీఠంపై మోదీ కూర్చుంటారని జోస్యం చెప్పారు. దేశ ప్రయోజనాల దృష్ట్యా బీజేపీకి ఓటు వేయాలని పిలుపునిచ్చారు.

రానున్న ఎన్నికల్లో అధిష్ఠానం ఎక్కడి నుంచి పోటీ చేయమని ఆదేశిస్తే అక్కడి నుంచి తాను పోటీ చేస్తానని తెలిపారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలనే కాపాడుకోలేని స్థితిలో కొట్టుమిట్టాడుతున్న కాంగ్రెస్‌ పార్టీకి పార్లమెంటు ఎన్నికల్లో ఓటు అడిగే నైతిక అర్హత లేదని విమర్శించారు.

కాంగ్రెస్‌ నేత కపిల్‌సిబల్‌, సయ్యద్‌సుజ అనే వ్యక్తి కలిపి జనవరి 21న లండన్‌లో ప్రెస్‌మీట్‌ పెట్టి 2014 ఎన్నికలకు ముందు తాను ఈవీఎంల ట్యాంపరింగ్‌కు పాల్పడ్డానని, 11 మందిని హత్య చేయించానని ఆరోపించిన విషయాన్ని కేంద్రమంత్రి దృష్టికి తీసుకువెళ్లినట్లు చెప్పారు. ఈ అంశంపై సమగ్ర విచారణ జరిపించాలని, కేసును సీబీఐకి అప్పగించాలని కోరినట్లు తెలిపారు.
Tags: trs party, bjp leader kisan reddy,telangana bjp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *