టీఆర్ఎస్‌లోకి ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి

టీఆర్ఎస్‌లోకి ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి

తెలంగాణలో కాంగ్రెస్ ఖాళీ అవుతోంది. పార్టీ నేతలు, కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. ఇప్పటికే మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఆత్రం సక్కు, రేగ కాంతారావు, లింగయ్య సహా పలువురు నేతలు కాంగ్రెస్ ను వీడి టీఆర్ఎస్ లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. తాజాగా, హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి కూడా వారి బాటనే ఎంచుకున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే ఆయన టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవడానికి రంగం సిద్ధం చేసుకున్నట్టు సమాచారం.

టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ను శుక్రవారం ఆయన నివాసంలోనే దేవిరెడ్డి కలుసుకోవడం ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చింది. దాదాపు గంటపాటు ఇద్దరి మధ్య చర్చలు జరిగినట్టు తెలుస్తోంది. ఎల్బీనగర్ నియోజకవర్గ అభివృద్ధి కోసం టీఆర్ఎస్‌లో చేరాలని నిర్ణయించినట్టు ఈ సందర్భంగా దేవిరెడ్డి పేర్కొన్నట్టు సమాచారం. కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి వైపు పరుగులు తీస్తోందని, ఆయన నాయకత్వంలో పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నానని ఆయన స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. దేవిరెడ్డి నిర్ణయాన్ని కేటీఆర్ స్వాగతించారు. సరైన నిర్ణయం తీసుకున్నారంటూ ప్రశంసించారు. మరో రెండు మూడు రోజుల్లో కేసీఆర్‌తో దేవిరెడ్డి సమావేశం కానున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *