జై శ్రీరాం నుంచి అల్లాహు అక్బర్ వరకు.. నినాదాలతో దద్దరిల్లిన లోక్‌సభ

లోక్‌సభలో కొత్త ఒరవడి
బల్లలు చరుస్తూ నినాదాలతో మోతెక్కించిన అధికార పార్టీ సభ్యులు
ఇంక్విలాబ్ జిందాబాద్ అని కలకలం రేపిన ఆప్ ఎంపీ
పార్లమెంటులో ప్రధాని చెప్పిన మాటలు సభ్యలు ప్రవర్తనకు పొంతనలేకుండా పోతోంది. సభ్యులు ఎంతమంది ఉన్నారనేది కాదని, ప్రతిపక్షాలు చురుకైన పాత్ర పోషించాలని, ప్రజా ప్రయోజనాల విషయంలో ప్రభుత్వానికి సహకరించాలని ఎంపీల ప్రమాణ స్వీకారానికి ముందు ప్రధాని కోరారు. అయితే, ఆయన ఆ మాట చెప్పి నిమిషాలైనా కాకముందే సభ నినాదాలతో హోరెత్తింది. ఎప్పడూ హుందాగా సాగే సభలో ఈసారి కొత్త ఒరవడి పురుడుపోసుకుంది. కొందరు ఎంపీలు ప్రమాణ స్వీకారం తర్వాత చివర్లో తమకు నచ్చిన నినాదం చేయడం మొదలుపెట్టారు. దీంతో సభ్యులు కూడా బల్లలు చరుస్తూ నినాదాలతో సభను హోరెత్తించారు.

బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్ ప్రమాణ స్వీకారానికి లేచినప్పుడు ‘మందిర్ వహీ బనాయేంగే’ అంటూ అధికార పార్టీ సభ్యులు నినాదాలు చేశారు. సంస్కృతంలో ప్రమాణస్వీకారం చేసిన సాక్షి మహరాజ్ చివర్లో ‘భారత్ మాతా కీ జై’, ‘జై శ్రీరాం’ నినాదాలతో ముగించారు. మధుర ఎంపీ హేమమాలిని ‘రాధే రాధే’ నినాదంతో ప్రమాణస్వీకారాన్ని ముగించారు.

ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు అధికార పార్టీ సభ్యులు ‘జై శ్రీరామ్’, ‘వందేమాతరం’ నినాదాలతో బల్లలు చరుస్తూ హోరెత్తించారు. దీంతో ఒవైసీ తన ప్రమాణ స్వీకారం ముగింపులో ‘జై భీం’, ‘జై మీమ్’, ‘తక్‌బీర్ అల్లాహు అక్బర్’ అని ముగించారు.

బీజేపీ ఎంపీలు తమ ప్రమాణస్వీకారం చివర్లో ‘భారత్ మాతా కీ జై’, ‘జై శ్రీరామ్’ నినాదాలు చేశారు. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు ప్రమాణస్వీకారానికి లేచినప్పుడు బీజేపీ సభ్యులు ‘భారత్ మాతా కీ జై’, ‘జై శ్రీరామ్’ నినాదాలు చేశారు. స్పందించిన టీఎంసీ సభ్యులు ప్రతిగా ‘జై దుర్గా’, ‘జై హింద్’ నినాదాలు చేశారు.

తొలిసారి ఎన్నికల బరిలో దిగి విజయం సాధించిన బీజేపీ ఎంపీ సన్నీడియోల్ ఇంగ్లిష్‌లో ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన ప్రమాణం చేస్తున్నంతసేపూ బీజేపీ సభ్యులు ‘భారత్ మాతా కీ జై’ నినాదాలు చేస్తూనే ఉన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ ఏకైక ఎంపీ భగవంత్ మాన్ ప్రమాణ స్వీకారం చివర్లో ‘ఇంక్విలాబ్ జిందాబాద్’ అంటూ కలకలం రేపారు. శిరోమణి అకాలీదళ్ చీఫ్ సుఖ్‌బీర్ సింగ్ బాదల్ ప్రమాణస్వీకారం చివర్లో ‘వహె గురూజీ కా ఖల్సా’ అని ముగించారు.

రాయ్‌బరేలీ ఎంపీ సోనియాగాంధీ హిందీలో ప్రమాణ స్వీకారం చేశారు. తర్వాత ఎంపీ మేనకాగాంధీ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్బంగా సోనియా-మేనక ఒకరికొకరు తారసపడ్డారు. ఈ సందర్భంగా ఒకరికొకరు అభివాదం చేసుకున్నారు. ఇక ఆరోగ్యం సహకరించని ములాయం సింగ్ యాదవ్ వీల్‌చైర్‌లో వచ్చి కూర్చునే ప్రమాణ స్వీకారం చేశారు. అఖిలేశ్ యాదవ్ కూడా ప్రమాణ స్వీకారం పూర్తి చేశారు. అలాగే కార్తీ చిదంబరం, టీఆర్ బాలు, ఎ.రాజా, కణిమొళి, దయానిది మారన్‌లు ప్రమాణ స్వీకారం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *