జెండాలో ఉన్న గులాబీ రంగును తీసేసారు

ఆర్టీసీ కార్మికుల స‌మ్మె అనడానికి బ‌దులుగా….తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ వ‌ర్సెస్‌..ఆయ‌న క‌నుస‌న్న‌ల్లో ఆర్టీసీ ఏర్పాటైన తెలంగాణ మజ్దూర్ యూనియన్(టీఎంయూ) నాయ‌క‌త్వం మ‌ధ్య పోరాటం అనేలా సాగుతున్న ఎత్తులు-పై ఎత్త‌ల ప‌ర్వంలో ఆర్టీసీ స‌మ్మె 24వ రోజుకు చేరిన సంగ‌తి తెలిసిందే.

హైకోర్టు ఆదేశాల మేర‌కు స‌మ్మె విర‌మ‌ణ‌కు చ‌ర్చ‌లు జ‌రిగిన‌ప్ప‌టికీ…ఇరుప‌క్షాల మ‌ధ్య స‌ఖ్య‌త కుద‌ర‌లేదు. ఇదిలా ఉండ‌గా..స‌రైన స‌మ‌యంలో తెలంగాణ ముఖ్య‌మంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధ్య‌క్షుడు కేసీఆర్‌ టీఎంయూ అధ్య‌క్షుడు అశ్వ‌త్థామ‌రెడ్డి షాకిచ్చార‌ని అంటున్నారు. టీఎంయూ జెండాలో ఇప్ప‌టివ‌ర‌కు ఉన్న గులాబీ రంగును తొల‌గించి…నూత‌న రంగుల‌తో జెండాను తీర్చిదిద్ద‌డం ద్వారా…ఊహించ‌ని ట్విస్ట్ తెర‌మీద‌కు తెచ్చార‌ని విశ్లేషిస్తున్నారు.

తెలంగాణ మజ్దూర్ యూనియన్(టీఎంయూ) తొమ్మిదో ఆవిర్భావ దినోత్సవం ఆదివారం జరిగింది. ఈ సంద‌ర్భంగా అశ్వ‌త్థామ‌రెడ్డి సార‌థ్యంలోని నేత‌లు కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. జెండా రంగు మార్చుతూ… ఇప్పటి వరకూ గులాబీ కలర్తో ఉన్న యూనియన్ జెండాలో ఆ రంగును తొలగించారు. గులాబీ రంగు స్థానంలో బ్లూ, వైట్ కల‌ర్ల‌లో జెండాను రూపొందించారు. టీఎంయూ ఆవిర్భావ కార్య‌క్ర‌మంలో నాయకులు కొత్త రంగుల్లో తీర్చిదిద్దిన పార్టీ జెండాను ఆవిష్క‌రించారు. త‌ద్వారా గులాబీ బాస్‌కు ఊహించ‌ని ట్విస్ట్ ఇచ్చారు.

ఇదిలా ఉండ‌గా, గత 23 రోజులుగా ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెలో నేడు కీల‌క ప‌రిణామాలు చోటుచేసుకునే అవ‌కాశం క‌నిపిస్తోంది. నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. రెండు రోజుల క్రితం కార్మిక సంఘాల నేతలతో జరిపిన చర్చల వివరాలను యాజమాన్యం కోర్టుకు సమర్పించనుంది. ఈ నేప‌థ్యంలో ఆర్టీసీ అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష సీఎం కేసీఆర్ నిర్వహించారు. కార్మిక సంఘాల తీరును తప్పుపట్టిన ముఖ్యమంత్రి.. కోర్టులో గట్టిగా వాదనలు వినిపించాలని చెప్పారు. కోర్టుకు నివేదించాల్సిన అంశాలపై అధికారులకు పలు సూచనలు చేశారు. చర్చలను కార్మిక సంఘాలు బహిష్కరించి వెళ్లాయని కోర్టుకు ప్రభుత్వం తెలపనున్న‌ట్లు స‌మాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *