‘జియో 6 పైసల’ ఎఫెక్ట్… దూసుకెళుతున్న టెల్కో ఈక్విటీలు!

  • నిమిషానికి 6 పైసలు వసూలు చేస్తామన్న జియో
  • అదే దారిలో ఎయిర్ టెల్, వోడాఫోన్ – ఐడియా పయనించే అవకాశం
  • టెలికం ఈక్విటీలకు కొనుగోలు మద్దతు

తమ నెట్ వర్క్ నుంచి ఇతర టెలికం నెట్ వర్క్ చేసే కాల్స్ పై నిమిషానికి 6 పైసలు వసూలు చేస్తామని రిలయన్స్ జియో నిన్న చేసిన ప్రకటన, సెల్ ఫోన్ వినియోగదారుల్లో తీవ్ర చర్చనీయాంశం కాగా, ఈ ఉదయం స్టాక్ మార్కెట్ పై మాత్రం ప్రతికూల ప్రభావాన్ని చూపింది. ఈ ఉదయం మార్కెట్ సెషన్ ప్రారంభంకాగానే, బెంచ్ మార్క్ సూచికలు స్వల్ప నష్టాల్లోకి జారుకోగా, టెలికం కంపెనీల ఈక్విటీలు మాత్రం భారీగా లాభపడ్డాయి.

జియో దారిలోనే ఎయిర్ టెల్ కూడా పయనిస్తుందన్న అంచనాలతో ఆ సంస్థ ఈక్విటీ ఏకంగా 6 శాతం పెరిగింది. ఇక వోడాఫోన్ ఐడియా ఏకంగా 15 శాతం లాభపడింది. బీఎస్ఈ సెన్సెక్స్ 130 పాయింట్లు, నిఫ్టీ 23 పాయింట్ల నష్టంలో ఉన్నాయి.

జియో మాదిరిగానే మిగతా అన్ని కంపెనీలు కూడా ఇతర నెట్ వర్క్ లకు చేసుకునే కాల్స్ పై చార్జీలను విధిస్తారని మార్కెట్ వర్గాలు నమ్మాయని, దీంతో ఇప్పటివరకూ నష్టాల్లో ఉన్న ఎయిర్ టెల్, ఐడియా వంటి సంస్థలు కొంతమేరకు కోలుకోవచ్చని మార్కెట్ నిపుణులు అంచనా వేశారు. ఈ కారణంతోనే ఆయా కంపెనీల ఈక్విటీలకు కొనుగోలు మద్దతు వచ్చిందన్నారు. ఇదిలావుండగా, నేడు వెల్లడికానున్న టీసీఎస్ త్రైమాసిక ఫలితాలు, ఆపై ఇన్ఫోసిస్ ఫలితాలు సమీప భవిష్యత్ లో మార్కెట్ గమనాన్ని నిర్దేశించవచ్చని అంచనా.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *