జగన్ భూ కుంభకోణానికి సంబంధించిన వివరాలను సీబీఐకి ఇచ్చా..: చంద్రబాబు

జగన్ భూ కుంభకోణానికి సంబంధించిన వివరాలను సీబీఐకి ఇచ్చా..: చంద్రబాబు

జాతీయ రాజకీయాలపై తనకు ఏమాత్రం ఆసక్తి లేదని, అందుకే ఢిల్లీ వెళ్లలేదని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. జాతీయ పత్రిక టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన సుదీర్ఘ ఇంటర్వ్యూలో చంద్రబాబు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రిగా తాను చేయాల్సిన పనులు చాలానే ఉన్నాయని, అందుకే ఢిల్లీ రాజకీయాల్లోకి వెళ్లలేదని స్పష్టం చేశారు.

ప్రధాని నరేంద్రమోదీని ఎదిరించడానికి చాలామంది భయపడుతున్నారని, కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ, తాను మాత్రమే ఆయనను ధైర్యంగా ఎదుర్కొంటున్నట్టు చెప్పారు. గత ప్రభుత్వాలు కూడా కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉపయోగించుకున్నాయని, అయితే, మరీ ఇంత దారుణంగా ఉపయోగించుకోలేదన్నారు. ఇది ముమ్మాటికీ వ్యవస్థలను దుర్వినియోగం చేయడమేనని మండిపడ్డారు.

ప్రత్యేక హోదా కోసం డిమాండ్ చేసిన తమపై దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతున్నారన్న చంద్రబాబు.. అందుకు తగిన మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరించారు. తప్పుడు పనులకు పాల్పడిన నేతలనే సీబీఐ, ఈడీలు టార్గెట్ చేస్తున్నాయి కదా? అన్న ప్రశ్నకు చంద్రబాబు బదులిస్తూ.. అలా అయితే, ఎన్డీయేతో కలిసున్న నాలుగేళ్లలో ఆ పని ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ భూ కుంభకోణానికి సంబంధించిన వివరాలను ఇటీవల మీడియాకు అందజేశానని, సీబీఐకి కూడా ఇచ్చానని, అయినప్పటికీ ఆ విషయం బయటకు రాలేదన్నారు. కాపలాదారుడినని చెప్పుకుంటున్న మోదీ దీనికి ఏం సమాధానం చెబుతారని చంద్రబాబు ప్రశ్నించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *