‘జగన్ దగ్గర వేరుశనగపప్పు.. కేసీఆర్ దగ్గర దాని పొట్టు’:పయ్యావుల సెటైర్లు!

సాగునీటి ప్రాజెక్టులు, నదీ జలాల విషయమై తెలంగాణ వైఖరిని గతంలో విమర్శించిన జగన్, ఈ రోజున కేసీఆర్ ను పొగుడుతున్నారని టీడీపీ సభ్యులు విమర్శించారు. ఏపీ ప్రయోజనాలకు భంగం వాటిల్లేలా జగన్ తో కేసీఆర్ ప్రతిపాదనలు ఉన్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బిల్లులపై చర్చలో భాగంగా ఏపీ శాసన సభలో ఈరోజు సమావేశం జరిగింది. ఈ సందర్భంగా టీడీపీ సభ్యుడు పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ, రేపు తెలంగాణ భూభాగంపై కాల్వలు వస్తే, అక్కడి బీడు భూములను తడుపుకుంటూ నీళ్లు రావాలని, ఆ నీళ్లు మనకు చేరతాయన్న నమ్మకం లేదని అన్నారు. బయట విస్తృతంగా ప్రచారంలో ఉన్న ఓ విషయాన్ని ప్రస్తావిస్తానంటూ జగన్ పై ఓ వ్యంగ్యాస్త్రాన్ని సంధించారు.

‘ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మంచి వేరుశనగపప్పు ఉంది. కేసీఆర్ గారి దగ్గర దాని పొట్టు ఉంది. మీ పప్పును, పొట్టును కలుపుకుని, ఇద్దరం చెరి సగం తీసుకుందాం. తినేముందు, పొట్టును ఊదుకుని తిందాం’ అన్నట్టుగా కేసీఆర్ గారు పెట్టిన ప్రతిపాదన ఉందని అంటున్నారు’ అని వ్యాఖ్యానించారు. కనుక, ఎవరు తెలివైన వాళ్లో ఆలోచించుకోవాల్సిన సమయమిది అని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలకు నష్టం వాటిల్లకుండా తీసుకునే ఏ చర్యను ప్రభుత్వం తీసుకున్నా, ప్రధాన ప్రతిపక్షంగా, రైతు పక్షపాతిగా టీడీపీ అభినందిస్తుందని అన్నారు.
Tags: Tdp Payyavula Keshav, KcrJagan Cm

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *