గోదావరి జలహారతి

గోదావరి జలహారతి

కాళేశ్వరం గంగ పొంగింది.. గోదారమ్మకు జలహారతి పట్టింది! ఒక ఆలోచన.. కార్యరూపం దాల్చింది! తెలంగాణ రైతుల తలరాతలు మార్చే వరప్రదాయినిగా ముఖ్యమంత్రి కేసీఆర్ తరచూ చెప్పే కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో మొదటి మోటర్ వెట్న్ విజయవంతంగా పూర్తయింది! కనువిందుచేసిన అపురూప జలదృశ్యంతో తెలంగాణ పులకించిపోయింది! ఉవ్వెత్తున ఎగిసిన నీళ్లను చూసి గోదారమ్మ మజిలీ ధవళేశ్వరమేకాదు.. తెలంగాణ బీడుభూముల్లో సిరులు పండించడం కూడా అనే భరోసాతో రైతన్న గుండె నిండిపోయింది! ఇంజినీర్లు చేపట్టినది ఒక్క మోటార్ పరీక్షే అయినా.. ఏకంగా నలభై లక్షల ఎకరాలకు జీవంపోసే ఒక భారీ ప్రాజెక్టు తన లక్ష్యాన్ని నెరవేర్చేందుకు సిద్ధంగా ఉన్నానంటూ విజయగర్వంతో విశ్వాస ప్రకటన చేసింది!
భారీ నిర్మాణాలు, బాహుబలి మోటర్లతో శరవేంగా సిద్ధమవుతున్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భారీ మోటర్‌కు బుధవారం ఇంజినీర్లు విజయవంతంగా వెట్న్ నిర్వహించారు. నీటిని ఎత్తిపోయడం ద్వారా మోటర్‌ను పరీక్షించేందుకు ఈ నెల 17వ తేదీన ప్రారంభించిన ప్రక్రియ.. ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తయింది. ఆరో ప్యాకేజీలో భాగంగా ధర్మారం మండలం నందిమేడారం అండర్ టన్నెల్‌లోని మొదటి మోటర్ ద్వారా నందిమేడారం రిజర్వాయర్‌లోకి 0.01 టీఎంసీల నీటిని 105 మీటర్ల ఎత్తుకు లిఫ్టు చేశారు. చిన్న అవరోధం కూడా ఎదురుకాకపోవడంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరీక్ష ద్వారా తెలంగాణ ఇంజినీర్ల సామర్థ్యం ప్రపంచానికి మరోసారి చాటినట్టయింది. వెట్న్ విజయవంతమైన తర్వాత సీఎం కేసీఆర్ నేరుగా కాళేశ్వరం ఈఎన్సీ వెంకటేశ్వర్లుకు ఫోన్‌చేసి అభినందించారు. ఈ ప్రక్రియలో పాల్గొన్న ఇంజినీర్లు, సాంకేతిక సిబ్బంది అందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

ప్రారంభించిన స్మితాసబర్వాల్
కాళేశ్వరం ప్రాజెక్టులో తొలి మోటర్ వెట్న్‌న్రు ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి స్మితాసబర్వాల్ బుధవారం మధ్యాహ్నం 12.03 గంటలకు పూజలుచేసి ప్రారంభించారు. హైదరాబాద్ నుంచి ఉదయం 11 గంటలకు నందిమేడారం చేరుకున్న స్మితాసబర్వాల్ ఉదయం 11.15 గంటలకు అండర్‌టన్నెల్‌కు చేరుకున్నారు. 15 నిమిషాలపాటు టన్నెల్‌లోని పంప్‌హౌస్‌ను పరిశీలించిన తర్వాత ప్రత్యేక పూజలుచేశారు. పూజల్లో నీటిపారుదలశాఖ అధికారులు, ఆరో ప్యాకేజీ కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు. అనంతరం మధ్యాహ్నం 12.03 గంటలకు కంప్యూటర్ ద్వారా నందిమేడారం పంప్‌హౌస్‌లోని 124.4 మెగావాట్ల మోటర్ వెట్న్‌న్రు స్మితాసబర్వాల్ ప్రారంభించారు. కొద్దిసేపటికే నిర్దేశిత 200 ఆర్పీఎం (రెవల్యూషన్స్ పర్ మినిట్-ఒక నిమిషానికి మోటర్ తిరిగే చుట్లు)కు చేరుకొని సర్జ్‌పూల్ నుంచి నీటిని ఎత్తిపోయడం మొదలుపెట్టింది. అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు స్మితా సబర్వాల్‌తోపాటు నీటిపారుదలశాఖ అధికారులు డెలివరీ సిస్టర్న్ (నీరు వెలుపలికి వచ్చే ప్రాంతం) వద్దకు చేరుకొని పంప్‌హౌస్ నుంచి వస్తున్న నీటికి ప్రత్యేక పూజలుచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *