గెలుపు తమదేనంటూ టీడీపీ, వైసీపీ.. ఎవరికి వారు చెబుతున్న కారణాలివే!

గెలుపు తమదేనంటూ టీడీపీ, వైసీపీ.. ఎవరికి వారు చెబుతున్న కారణాలివే!

ఏపీలో దాదాపు 80 శాతం పోలింగ్ జరిగింది. అంటే 2014తో పోలిస్తే, సుమారు 3 శాతం వరకూ అధికం. పెరిగిన ఓటింగ్ శాతం తమకు అనుకూలమంటే తమకు అనుకూలమని అధికార తెలుగుదేశం, విపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు ధీమాగా ఉన్నాయి. ‘పసుపు – కుంకుమ’, పింఛన్ల పెంపు, అమరావతి, పోలవరం తదితరాలు తమకు అనుకూలమని టీడీపీ అంటుంటే, గత ఐదేళ్ల పాలనలో వచ్చిన ప్రజా వ్యతిరేకతే ఓట్ల రూపంలో వెల్లువెత్తిందని వైసీపీ చెబుతున్న పరిస్థితి. ఈ ఎన్నికల్లో విజయం తమదేనని రెండు పార్టీలూ ఘంటాపథంగా చెబుతున్నాయి.

పోలింగ్ శాతం పెరగడం, మహిళలు, వయోవృద్ధులు ఉత్సాహంగా ఓటేయడం తమకు లాభిస్తుందని టీడీపీ చెబుతోంది. ఇదే సమయంలో పోటీలో నిలబడిన అభ్యర్థులను చూడకుండా, తననే అభ్యర్థిగా భావించి ఓట్లు వేయాలని సీఎం చంద్రబాబు ప్రచారం చివర్లో విజ్ఞప్తి చేయడంపై సానుకూల స్పందన వచ్చిందని టీడీపీ చెబుతోంది.

ఇక, ప్రభుత్వ వ్యతిరేకత బలంగా ఉన్న కారణంగానే 80 శాతానికి పైగా పోలింగ్‌ నమోదైందని వైసీపీ చెబుతోంది. తమ అధినేత వైఎస్ జగన్‌ పాదయాత్రతో ప్రజలకు చేరువయ్యారని, ప్రత్యేకహోదా అంశంపై తాము మొదటి నుంచి ఒకే మాటపై ఉన్నామన్న విషయం ప్రజలకు తెలుసునని వైసీపీ చెబుతోంది. బీజేపీతో నాలుగున్నరేళ్లు కలిసుండి, ఎన్నికలకు ముందు టీడీపీ ఆ పార్టీతో విడిపోయిందని, ఈ అంశాలన్నీ తమకు లాభిస్తాయని వైసీపీ నేతలు అంచనా వేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *