కోడెల మృతికి గొల్లపల్లి దిగ్ర్భాంతి

రాజోలు, సెప్టెంబర్ 16: శాసనసభ మాజీ స్పీకర్, మాజీ మంత్రి డాక్టర్ కోడెల శివప్రసాదరావు మృతి పట్ల మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాజోలు మండలం శివకోటి గ్రామ టిడిపి అధ్యక్షులు మెరుగుమువ్వల ప్రసాద్ నివాసం వద్ద నియోజకవర్గ టిడిపి ఆధ్వర్యంలో కోడెల శివప్రసాదరావు మృతికి సంతాప సూచకంగా సోమవారం సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో గొల్లపల్లి మాట్లాడుతూ పేదల సంక్షేమానికి, నవ్యాంధ్ర నిర్మాణానికి కోడెల అందించిన సేవలు చిరస్మరణీయమని అన్నారు. శాసనసభ స్పీకర్ గా సభలో పలు అంశాలపై చర్చ జరిగేటపుడు తనకు చక్కటి అవకాశాలు కల్పించే వారని గుర్తు చేసుకున్నారు. రాజోలు నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభానికి తీసుకువచ్చిన సందర్భాన్ని గుర్తు చేసుకుని గొల్లపల్లి కన్నీటి పర్యంతమయ్యారు.

వైసీపీ ప్రభుత్వం కోడెలపై తప్పుడు కేసులు బనాయించి వేధింపులకు గురి చేసిందని, శాసనసభ స్పీకర్ గా పని చేసిన వ్యక్తిని అవమానాల పాలు చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. కోడెల ఆత్మ శాంతి కి రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు మన్నె త్రినాధ కాశీ విశ్వేశ్శరరావు, కసుకుర్తి త్రినాధస్వామి, బోళ్ళ సతీష్ బాబు, చాగంటి స్వామి, బోళ్ళ రామలింగ సత్యానందం, బేతినీడి శ్రీను, ఇసుకపల్లి బంగారం, మామిడిశెట్టి ఏసుబాబు, కొణతం దొరబాబు, మట్టపర్తి సత్యనారాయణ, బోళ్ళ ప్రతాప్, కడలి కపిల్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *