కేసీఆర్ వ‌ద్ద గొర్రెలాగా ప‌నిచేశానంటోన్న మాజీ ఎంపీ

“టీఆర్ఎస్ పార్టీ అధినేత‌, ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఎలా చెబితే అలా చేశా.. ఓ గొర్రెలాగా ప‌నిచేసిన‌. గొర్రె లాగా త‌లూపిన‌. ఆయ‌న‌ ఏది చెబితే అది విన్నా. కానీ.. ఆయ‌న న‌న్ను న‌మ్మ‌లేదు. న‌న్ను పులిలా భావించాడు. అందుకే నాకు టికెట్ ఇవ్వ‌లేదు ” అని మాజీ ఎంపీ, బీజేపీ నేత జితేంద‌ర్‌రెడ్డి సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. ఓ న్యూస్ ఛానెల్ నిర్వ‌హించిన ప్ర‌త్యేక కార్య‌క్ర‌మంలో జితేంద‌ర్‌రెడ్డి ఈ వ్యాఖ్య‌లు చేశారు. ఇప్పుడు ఈ వ్యాఖ‌లు రాజ‌కీయ‌వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ‌కు దారితీస్తున్నాయి. త‌న‌తోపాటు హ‌రీశ్‌రావు, ఈట‌ల రాజేంద‌ర్‌.. ఇలా చాలామంది నేత‌ల‌ను కేసీఆర్ న‌మ్మ‌లేద‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు.

తాను మ‌రోసారి పార్ల‌మెంట్‌లో అడుగుపెడితే.. ఎక్క‌డ ఎదిగిపోతాడోన‌న్న భ‌యంతోనే కేసీఆర్ త‌న‌కు టిక‌ట్ ఇవ్వ‌లేద‌ని జితేంద‌ర్‌రెడ్డి విమ‌ర్శ‌లు గుప్పించారు. 2014 ఎన్నిక‌ల్లో జితేంద‌ర్‌రెడ్డి టీఆర్ఎస్ నుంచి మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ ఎంపీగా గెలిచాడు. పార్ల‌మెంట్ ప‌క్ష నేత‌గా కూడా ప‌నిచేశాడు. అయితే.. ఏం జ‌రిగిందో తెలియ‌దుగానీ.. 2019లో జ‌రిగిన పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో జితేంద‌ర్‌రెడ్డికి సీఎం కేసీఆర్ టికెట్ ఇవ్వ‌లేదు. దీంతో ఆయ‌న టీఆర్ఎస్ పార్టీని వీడి.. బీజేపీలోకి వెళ్లారు. అక్క‌డ కూడా ఆయ‌న‌కు టికెట్ రాలేదు. అయితే.. తాను సొంత‌గూటికి వ‌చ్చినందుకు ఎంతో సంతోషంగా ఉంద‌ని చెబుతున్నారు జితేంద‌ర్‌రెడ్డి.

ఇదే స‌మ‌యంలో సీఎం కేసీఆర్ గురించి ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాలు చెప్ప‌డం.. కేసీఆర్ గొప్ప మేధావి అంటూ పొగిడారు. ఆయ‌నకు ప్ర‌పంచ దేశాల‌పై అపార‌మైన విష‌య ప‌రిజ్ఞానం ఉంద‌ని, తాను ఇప్ప‌టివ‌ర‌కు అంత నాలెడ్జ్ ఉన్న నేత‌ను చూడ‌ల‌ని జితేంద‌ర్‌రెడ్డి చెప్పుకొచ్చారు. 2018లో జ‌రిగిన‌ ముంద‌స్తు అసెంబ్లీ ఎన్నిక‌ల ముందు వ‌ర‌కు కేసీఆర్ ఒక‌లా ఉండేవార‌ని, ఈ ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించిన త‌ర్వాత మ‌రోలా ఉంటున్నార‌ని జితేంద‌ర్‌రెడ్డి విమ‌ర్శించారు. అప్పుడు మ‌నం అనేవార‌ని, ఇప్పుడు నేను.. నేను మాత్ర‌మే అంటున్నార‌ని, పార్టీలో ఎవ‌రినీ న‌మ్మ‌డం లేద‌ని ఆయ‌న విమ‌ర్శ‌లు గుప్పించారు.

అయితే.. హ‌రీశ్‌రావు నిజంగానే బీజేపీ నేత‌ల‌తో చ‌ర్చ‌లు జ‌రిపారా..? అన్న ప్ర‌శ్న‌కు మాత్రం ఆయ‌న సూటిగా స‌మాధానం చెప్ప‌కుండా దాట‌వేయ‌డం గ‌మ‌నార్హం. అంద‌రిలాగే తానూ విన్నాన‌ని, కానీ.. దానిపై త‌న‌కు అవ‌గాహ‌న లేదంటూ దాట‌వేశారు. ఇక ఇదే స‌మ‌యంలో క‌మ‌లం వ‌ర్గాల్లో కాక‌పుట్టిస్తూ..త‌న మ‌న‌సులో మాట‌ను కూడా బ‌య‌ట‌పెట్టారు. రాష్ట్ర ప‌గ్గాలు త‌న‌కు అప్ప‌గిస్తే.. చేయ‌డానికి రెడీగా ఉన్నానంటూ జితేంద‌ర్‌రెడ్డి చెప్పారు. ఈ వ్యాఖ్య‌ల‌పై టీఆర్ఎస్ నేత‌ల రిటాక్ట్ ఎలా ? ఉంటుందో ? చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *