టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్

కార్యకర్తలకు అండగా ఉంటా: టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్

మంగళగిరి, జూలై 4(గోదావరి విలేకరి): కార్యకర్తలకు ఎల్లప్పుడూ అండగా ఉంటూ పార్టీ పటిష్ఠత కోసం కృషి చేస్తానని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చెప్పారు. గురువారం మంగళగిరి టిడిపి కార్యాలయంలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో లోకేష్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ పార్టీ పటిష్టతకు, స్థానిక సంస్థల ఎన్నికలలో విజయానికి ప్రణాళికా బద్దంగా కృషి చేద్దామని చెప్పారు. త్వరలో మండలాల వారీగా సమావేశాలు నిర్వహించి పార్టీ కార్యక్రమాలు ముమ్మరం చేద్దామని అన్నారు. కష్టపడి పని చేసిన కార్యకర్తలు, నాయకులకు తగిన గుర్తింపు ఇస్తామని చెప్పారు. రాష్ర్టంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు గాలికి వదిలి కక్ష సాధింపు రాజకీయాలకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని ఆరోపించారు.

ప్రభుత్వ కార్యక్రమాలకు వినియోగించుకునే ప్రజావేదిక కూల్చివేతపై ఉన్న శ్రద్ధ జగన్ ప్రభుత్వానికీ రైతులకు విత్తనాలు పంపిణీ విషయంలో లేదని లోకేష్ విమర్శించారు. ప్రభుత్వం ఏ కార్యక్రమం పైనా స్పష్టత లేని రీతిలో పయనిస్తోందని ఆయన ఎద్దేవా చేశారు. రాజధాని రైతులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. రాజధానిలో తాము అధికారంలో ఉన్నప్పుడు తలపెట్టిన ఏ కార్యక్రమాన్ని ప్రభుత్వం ఆపేసినా ప్రజా ఉద్యమం చేపడతామని లోకేష్ హెచ్చరించారు. పాలనపై ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డికి అవగాహన లేదని, ఆ విషయం బయటపడకుండా గత ప్రభుత్వం పై బురద చల్లే కార్యక్రమం పెట్టుకున్నారని విమర్శించారు. ప్రతిపక్ష పార్టీలపై వేధింపులకు పాల్పడటంలో జగన్ తన తండ్రి బాటలోనే పయనిస్తున్నారని లోకేష్ ఆరోపించారు.

గతంలో రాజశేఖర రెడ్డి అధికారంలోకి వచ్చిన మొదటి వంద రోజులలో 60కి పైగా టిడిపి కార్యకర్తలను హత్య చేయించారని ఆరోపించారు. జగన్ అధికారం లోకి వచ్చిన ఈ నెల రోజులలో ఆరుగురు టిడిపి కార్యకర్తలను హత్య చేయించారని ఆరోపించారు లోకేష్ ఆరోపించారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ప్రవేశ పెట్టిన ఒక్కో సంక్షేమ కార్యక్రమాన్ని జగన్ అటకెక్కిస్తున్నారని ఆయన విమర్శించారు. ఇంటర్మీడియట్ విద్యార్దులకు మధ్యాహ్న భోజనం ఎత్తివేశారని, రాజధాని పనులు ఆపేశారని, రైతులకు కౌలు డబ్బులు వేయడం లేదని, కరెంటు కోతలు పెరిగాయని, రైతులకు విత్తనాలు సరఫరా చేయడం లేదని జగన్ ప్రభుత్వం పై లోకేష్ మండిపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *