కర్ణాటక కాంగ్రెస్ నేత డీకేకు పది రోజుల ఈడీ కస్టడీ.. కోర్టు ఆదేశాలు!

కర్ణాటక కాంగ్రెస్ నేత డీకే శివకుమార్‌ను ఈ నెల 13 వరకు ఈడీ కస్టడీకి అప్పగిస్తూ ఢిల్లీలోని రౌజ్ ఎవెన్యూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కేసు విచారణ కీలక దశకు చేరుకుందని, డీకేను మరింత లోతుగా విచారించాల్సి ఉండడంతో 14 రోజుల కస్టడీకి అప్పగించాలని ఈడీ కోరింది. అయితే, కోర్టు మాత్రం పది రోజుల కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న డీకే శివకుమార్‌ను మంగళవారం ఈడీ అరెస్ట్ చేసింది. అరెస్ట్ తర్వాత డీకే చాతి నొప్పితో బాధపడడంతో ఆర్ఎంఎల్ ఆసుపత్రిలో చేర్చారు. ఈ సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఆసుపత్రి నుంచి నేరుగా ఆయనను కోర్టులో ప్రవేశపెట్టారు.

దర్యాప్తునకు డీకే సహకరించడం లేదని, ప్రశ్నలకు పొంతనలేని సమాధానాలు ఇస్తున్నారని ఈడీ ఆరోపించింది. ఆయనను మరింత లోతుగా విచారించాల్సి ఉండడంతో 14 రోజుల కస్టడీ ఇవ్వాలని కోర్టును అభ్యర్థించింది. అయితే, ఈడీ వాదనను డీకే తరపున వాదనలు వినిపించిన అభిషేక్ మను సింఘ్వి తప్పుబట్టారు. ఈడీ కుక్కతోకలా తయారైందని, రాష్ట్రం శునకంలా వ్యవహరిస్తోందని తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు. కుక్కలేకుండా తోక లేదని పేర్కొన్నారు. ఇప్పటికే ఐదు రోజులు ప్రశ్నించారని, ఇప్పుడు మరో 14 రోజుల కస్టడీ అడుగుతున్నారని అన్నారు. ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం డీకేను ఈ నెల 13 వరకు కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *