కరెంట్‌ అడిగితే గత పాలకులు కాల్చి చంపారు

కరెంట్‌ అడిగితే గత పాలకులు కాల్చి చంపారు

కరెంట్‌ అడిగితే గత పాలకులు కాల్చి చంపారని, టీఆర్‌ఎస్‌ పాలనలో మాత్రం 24 గంటలు కరెంట్‌ అందిస్తున్నామని టీఆర్‌ఎస్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం మల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని నాచారం హెచ్‌ఎంటీనగర్‌ బస్టాప్‌ వద్ద, ఈసీఐఎల్‌ చౌరస్తాలో ఏర్పాటు చేసిన రోడ్‌షోలలో ఆయన మాట్లాడారు. దక్షిణ భారతదేశంలో పట్టుమని పది సీట్లు కూడా గెలుచుకోలేని పార్టీలు జాతీయ పార్టీలు ఎలా అవుతాయని ప్రశ్నించారు.

2014లో నరేంద్రమోదీ ఛాయ్‌ పే చర్చా అని ఒక డ్రామాకు తెర లేపారని, ఇప్పుడు దేశం మొత్తానికి ఆ డ్రామా అర్థమైందన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీకి 150, కాంగ్రెస్‌కు 100 సీట్లు కూడా రావని జోస్యం చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మిషన్‌ కాకతీయ, రైతుబంధు, తెలంగాణ సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలుపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందన్నారు. తెలంగాణ మరింత అభివృద్ధి చెందాలంటే మల్కాజ్‌గిరిసహా 16 ఎంపీ స్థానాలను గెలిపించాలని ఆయన ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

మోదీ వేడి తగ్గింది…కాంగ్రెస్‌ గాడి తప్పింది
దేశంలో మోదీ వేడి తగ్గింది…కాంగ్రెస్‌ గాడి తప్పిందని కేటీఆర్‌ ఎద్దేవా చేశారు. భారతజాతిని విస్మరించిన రెండు పార్టీలకు ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఐదేళ్ల బీజేపీ పాలనలో మోదీ వేషం మారిందే కాని దేశం మారలేదన్నారు. దేశానికి చౌకీదార్, టేకీదార్‌ అవసరం లేదని, బాధ్యత కలిగి, పేదల సమస్యలు తెలిసిన కేసీఆర్‌ నాయకత్వం కావాలన్నారు.16 మంది టీఆర్‌ఎస్‌ ఎంపీలుంటే ఢీల్లీ రాజకీయ వ్యవస్థను శాసించవచ్చని పేర్కొన్నారు. ‘ఆలోచించండి, ఆగం కాకండి.. ఓటు వేసే ముందు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి’అని అభ్యర్థించారు. ముంబై మెట్రోరైలు ప్రాజెక్టుకు రూ.18 వేల కోట్లిచ్చిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు కేవలం రూ.12 వందల కోట్లు ఇచ్చిందన్నారు. ఇలా అన్నింట్లోనూ మనకు అన్యాయమే జరుగుతోందన్నారు.

గత 5 ఐదేళ్లలో తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలిపిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. చాయ్‌పే చర్చకు బదులు దేశంలో ‘తెలంగాణ పే చర్చ’జరుగుతోందన్నారు. మల్కాజ్‌గిరి లోక్‌సభ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి విద్యావేత్త, యువకుడు మర్రి రాజశేఖరరెడ్డిని గెలిపించుకుంటారా.. నోట్ల కట్టలతో అడ్డంగా దొరికిన దొంగకు ఓటు వేస్తారా.. అనేది నిర్ణయించుకోవాలి’ అని అన్నారు. ‘మీటింగ్‌కు ఆలస్యంగా రావడం.. ట్రాఫిక్‌కు అసౌకర్యం కలిగినందుకు క్షమించండి’ అంటూ ప్రసంగాన్ని ముగించారు. కేటీఆర్‌ రోడ్‌ షోకు భారీగా జనం తరలి వచ్చారు. ఆయా కార్యక్రమాల్లో టీఆర్‌ఎస్‌ లోక్‌సభ అభ్యర్థి మర్రి రాజశేఖర్‌రెడ్డి, మంత్రి మల్లారెడ్డి, ఉప్పల్‌ ఎమ్మెల్యే బేతి సుభాష్‌రెడ్డి, నేతలు బండారి లక్ష్మారెడ్డి, కార్పొరేటర్లు గొల్లూరి అంజయ్య, పావనిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఈ గట్టున కారు…ఆ గట్టున బేకారు..
‘ఈ గట్టున కారు ఉంది… ఆ గట్టున బేకారు ఉంది. ఎక్కడ ఉంటారో ప్రజలే తేల్చుకోవాలి’అని కేటీఆర్‌ అన్నారు. ఉప్పల్‌ నల్ల చెరువు అభివృద్ధికి దాదాపు రూ.16 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం వెచ్చించిందని, మల్లాపూర్‌ సింగంచెరువు తండాలో డబుల్‌ బెడ్‌రూమ్‌లను నిర్మించి పేదలకు అందించామని గుర్తుచేశారు. మరో ఆరునెలల్లో పదివేల డబుల్‌ బెడ్‌రూమ్‌లను అందించే బాధ్యత తమ ప్రభుత్వంపై ఉందన్నారు. టీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి మర్రి రాజశేఖర్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. హెచ్‌ఎంటీనగర్‌ వద్ద నిర్వహించిన రోడ్‌షోలో కొందరు డ్రోన్‌ కెమెరాతో చిత్రీకరిస్తుండగా నాయకులు అభ్యంతరం తెలపడంతో నిలిపివేశారు.

Tags: TRS,Narendra Modi,KTR,Telangana ,Lok Sabha, Elections 2019

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *