కప్పు టీ కూడా దొరకని ఈ హైకోర్టు ఎందుకు?: ఏపీ సర్కారుకు న్యాయమూర్తుల ప్రశ్న

  • కూర్చోవడానికి కూడా చోటు లేదు
  • న్యాయమూర్తులు గెస్ట్ హౌస్ లలో ఉంటున్నారు
  • స్విస్ చాలెంజ్ పై అభిప్రాయం ఏంటి?
  • రెండు వారాల్లో చెప్పాలని ధర్మాసనం ఆదేశం

ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఎన్నో సమస్యలు ఉన్నాయని, ఇక్కడికి వచ్చేందుకు ప్రతి ఒక్కరూ ఇబ్బందులు పడుతున్నారని, కూర్చోవడానికి చోటు లేకపోవడంతో పాటు, తాగాలంటే కప్పు టీ కూడా దొరకని పరిస్థితి నెలకొందని, మరెంతకాలం ఇలాగ ఉండాలని హైకోర్టు ఏపీ సర్కారును ప్రశ్నించింది. న్యాయమూర్తులకు ఇళ్లు లేవని, వారంతా గెస్ట్ హౌస్ లలో ఉంటున్నారని గుర్తు చేస్తూ, తగినన్ని సౌకర్యాలు కల్పించకుంటే తాము కల్పించుకోవాల్సి వుంటుందని హెచ్చరించింది.

మాజీ సీఎం, ఇప్పటి సీఎంల ఎజెండాలు ఏమిటన్న విషయంతో తమకు సంబంధం లేదని, చట్టంతో మాత్రమే తమకు సంబంధమని, రాజధాని నిర్మాణం, స్విస్ చాలెంజ్ విధానంపై ప్రభుత్వ వైఖరి చెప్పాలని ఆదేశించింది.

ఇటీవలి కాలంలో ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో పాటు ఏపీఐడీఈ చట్టం-2001కు సవరణ చేస్తూ, న్యాయశాఖ కార్యదర్శి తీసుకొచ్చిన చట్ట సవరణపై దాఖలైన పిటిషన్లను విచారించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు బృందం పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

హైకోర్టు వద్ద నెలకొని ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం కట్టుబడి వుండాలని, రెండు వారాల్లో తమ వైఖరేంటో చెబుతూ ప్రమాణ పత్రాన్ని దాఖలు చేయాలని ఆదేశించింది. అంతకు మించి గడువు ఇచ్చే పరిస్థితి లేదని తేల్చి చెప్పింది. తేడా వస్తే మధ్యంతర ఉత్తర్వులు ఇస్తామని, వాటిపై అభ్యంతరాలుంటే, సుప్రీంకోర్టుకు వెళ్లవచ్చని చెబుతూ, తదుపరి విచారణను వచ్చే నెల 21కి వాయిదా వేసింది.
Tags: Andhra Pradesh, AP High Court, Jagan govt, Advocates

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *