ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ ఖాళీ.. ఓ మహిళకు జారీచేసిన చెక్కు బౌన్స్!

ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ ఖాళీ.. ఓ మహిళకు జారీచేసిన చెక్కు బౌన్స్!

కర్నూలు జిల్లాలోని పాణ్యంలో ఘటన
సీఎం సహాయనిధికి దరఖాస్తు చేసిన జ్యోతి
నిధులు లేవని అధికారుల సమాధానం
తీవ్రమైన అనారోగ్యానికి చికిత్స కోసం సామాన్యులు ఆశ్రయించే సీఎం రిలీఫ్ ఫండ్ లో నిధులు నిండుకున్నాయి. తాజాగా కర్నూలు జిల్లాలోని పాణ్యం ప్రాంతానికి చెందిన ఓ మహిళకు జారీచేసిన ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ చెక్కు బౌన్స్ అయింది. బ్యాంకు ఖాతాలో తగినన్ని నిధులు లేవంటూ బ్యాంకు అధికారులు సంబంధిత వ్యక్తులను వెనక్కు తిప్పిపంపారు. పాణ్యం నియోజకరవర్గంలోని నాగిరెడ్డి కాలనీకి చెందిన గంగాధర్ రెడ్డి భార్య జ్యోతి ఇటీవల అనారోగ్యం పాలయ్యారు.

దీంతో 2018, నవంబర్ లో ఆమెను ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు వీలైనంత త్వరగా ఆపరేషన్ చేయాలని సూచించారు. అప్పులు, చేబదుళ్ల ద్వారా రూ.56,000 తెచ్చుకున్న గంగాధర్ రెడ్డి భార్యకు ఆపరేషన్ చేయించారు. అనంతరం సహాయం కోసం పాణ్యం టీడీపీ ఇన్‌చార్జి ఏరాసు ప్రతాప్‌రెడ్డి ద్వారా నవంబర్‌ 26న సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు దరఖాస్తు చేసుకున్నారు.

తొలుత రూ.26,920 మంజూరు చేస్తున్నట్టు ఈ ఏడాది మార్చి 15న సమాచారం వచ్చింది. ఎన్నికల పోలింగ్‌కు రెండు రోజుల ముందు ఏప్రిల్‌ 9వ తేదీన ఏరాసు ప్రతాప్‌రెడ్డి బాధిత కుటుంబానికి సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కును అందించారు. మరుసటిరోజే ఈ చెక్కును బ్యాంకులో సమర్పించగా, ఆ నెల 15న సీఎం రిలీఫ్ ఫండ్ ఖాతాలో తగినన్ని నిధులు లేవని బ్యాంకు అధికారులు లిఖితపూర్వకంగా గంగాధర్ రెడ్డికి జవాబిచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *