ఎదురేగిన గోదారమ్మ

నిర్విరామంగా పనిచేస్తున్న మూడు మోటర్లు.. సెకనుకు 60 క్యూమెక్స్‌ల చొప్పున రోజుకు 6300 క్యూసెక్కుల నీటి ఎత్తిపోత! ఏక్షణమైనా నిరంతరాయంగా నీటిని ఎత్తిపోయనున్న నాలుగో నంబర్ మోటర్! ఇదీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కన్నెపల్లి పంప్‌హౌస్ జల ప్రగతి! ప్రాణహిత వరదనీరు గోదావరిలోకి వచ్చి చేరుతున్న నేపథ్యంలో ఒక్కొక్క మోటర్‌ను ప్రారంభించిన అధికారులు.. ప్రస్తుతానికి మూడు మోటర్ల ద్వారా నిరంతరాయంగా గోదావరి జలాలను కన్నెపల్లి పంప్‌హౌస్ ద్వారా ఎత్తిపోస్తున్నారు. ఈ నీరు గ్రావిటీ కెనాల్ ద్వారా అన్నారం బరాజ్‌కు చేరుతున్నది. నది సహజస్వభావానికి భిన్నంగా నీటిప్రవాహం పల్లంనుంచి ఎదురెక్కుతుండటంతో ఎగువ ప్రాంత తీర గ్రామాల చెంతకు గోదారమ్మ పరవళ్లు తొక్కుతున్నది.

సాధారణంగా ఎస్సారెస్పీ, ఎల్లంపల్లి నుంచి రావాల్సిన గోదారమ్మ.. ఎదురుప్రవాహంతో వస్తున్న దృశ్యం సమీప ప్రాంతాల గ్రామాల ప్రజలను సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తున్నది. రివర్స్ పంపింగ్‌తో అన్నారం బరాజ్‌లో నీటిమట్టం పెరుగుతుండటంతో పెద్దపల్లి జిల్లా మంథని మండలంలోని ఆరెంద, మల్లారం గ్రామాల దాకా నీరు కనిపిస్తున్నది. మరో 20 కిలోమీటర్ల మేర జలాలు ఎగబాకితే అన్నారం పంప్‌హౌస్‌ను చేరుకుంటాయి. మంగళవారం వరకు 0.82 టీఎంసీల నీరు అన్నారం బరాజ్‌కు చేరినట్లు సాగునీటిశాఖ ఇంజినీర్లు వెల్లడించారు. బుధవారంనాటికి బరాజ్‌లో నీటి నిల్వ ఒక టీఎంసీకి పెరుగుతుందని ప్రాజెక్టు ఈఈ యాదగిరి చెప్పారు. ఇదిలాఉంటే.. ఈ పంప్‌హౌస్‌లోని నాలుగో నంబర్ మోటర్‌ను మంగళవారం మధ్యా హ్నం ఆరు నిమిషాలపాటు వెట్న్ చేశారు. ఈ మోటర్‌కు కొన్ని పరీక్షలు చేయాల్సి ఉన్నందున వాటిని పూర్తిచేసి ఏ సమయంలోనైనా నిరంతరాయంగా మోటర్‌ను నడిపించే పనిలో ఇంజినీర్లు ఉన్నారు. ఈ నెల 15లోపు అన్ని మోటర్ల వెట్న్ ప్రారంభించాలన్న ప్రభుత్వ ఆదేశాలతో మరో అపురూప దృశ్యం కొన్నిరోజుల్లోనే సాక్షాత్కరించనున్నది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *