ఇసుకో రామచంద్రా.. ఏపీలో ఇసుక కోసం 10 కిలోమీటర్ల మేర ట్రాక్టర్ల బారులు!

ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. ఏపీలో ప్రభుత్వం మారాక పాత ఇసుక విధానాన్ని రద్దు చేయడంతో గుప్పెడంత ఇసుక కోసం నిర్మాణ రంగం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తోంది. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇసుక విషయంలో కఠినంగా వ్యవహరిస్తోంది. కొంత కాలంగా ఇసుక అమ్మకాలను కూడా నిలిపివేసింది. దీంతో ఇసుక కష్టాలు చెప్పనలవి కాకుండా ఉన్నాయి. ఇక కృష్ణా జిల్లాలో అయితే ఇసుక కోసం జనం అల్లాడిపోతున్నారు. తోట్లవల్లూరులో ఇసుక క్వారీ వద్ద ఏకంగా పది కిలోమీటర్ల మేర ట్రాక్టర్లు బారులు తీరడం అక్కడి పరిస్థితికి అద్దం పడుతోంది. మరోవైపు, ఇసుక దొరక్క నిర్మాణాలు నిలిచిపోవడంతో కార్మికులు ఉపాధి కోల్పోతున్నారు.

టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇసుకను ఉచితంగా సరఫరా చేయగా, జగన్ సర్కారు పాత విధానాన్ని రద్దు చేసి కొత్త పాలసీని తీసుకొచ్చింది. ట్రాక్టర్ ఇసుకను రూ.330గా నిర్ణయించింది. అంతేకాదు, ప్రభుత్వ అధికారుల సమక్షంలోనే ఇసుకను విక్రయిస్తున్నారు. ఇక, కృష్ణా, గుంటూరు జిల్లాలకు కలిపి ఒకే ఒక్క క్వారీని తెరవడంతో వేలాది ట్రాక్టర్లు క్వారీ వద్ద బారులు తీరాయి. బ్లాక్ మార్కెట్లో ట్రాక్టర్ ఇసుక రూ.15 వేల వరకు పలుకుతోంది. అంతసొమ్ము పెట్టలేక చాలామంది క్వారీల వద్దే రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నారు.
Tags: Andhra PradeshTractorSand

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *