ఇరాన్‌పై అమెరికా సైబర్ అటాక్.. ఇరు దేశాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు..

అమెరికా – ఇరాన్‌ల మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరింది. నిఘా డ్రోన్ కూల్చివేసిన ఇరాన్‌పై అమెరికా ఆగ్రహంతో ఊగిపోతోంది. చర్యకు ప్రతిచర్యగా ఇరాన్‌పై క్షిపణి దాడికి సిద్ధపడ్డ అగ్రరాజ్యం చివరి నిమిషంలో మనసు మార్చుకుంది. తాజాగా ఇరాన్ ఆర్మీ కంప్యూటర్ సిస్టంపై అమెరికా సైబర్ అటాక్ చేసింది. యూఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఆదేశాల మేరకు సైబర్ దాడులు జరిగినట్లు తెలుస్తోంది.

ఇరాన్ – అమెరికా మధ్య కొంతకాలంలో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇరాన్‌కు బుద్ది చెప్పాలన్న ఉద్దేశంతో అమెరికా కంటిన్జెన్సీ ప్లాన్ రూపొందించింది. దాని ప్రకారం ఇరాన్ దేశ రాకెట్, మిసైల్ లాంఛర్లను నియంత్రించే కంప్యూటర్ వ్యవస్థలను నిర్వీర్యం చేసింది. ముఖ్యంగా ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కంప్యూటర్లను టార్గెట్ చేసింది. ట్రంప్ అధికారం చేపట్టిన నాటి నుంచి అమెరికా అధికారులు శత్రువులను ఎక్కువగా సైబర్ రంగంలోనే లక్ష్యంగా చేసుకున్నారు.

స్పందించని ఇరాన్..అమెరికా సైబర్ దాడులపై ఇరాన్ ఇప్పటి వరకు స్పందించలేదు. గతంలో స్టక్స్‌నెట్ కంప్యూటర్ వైరస్ ఆ దేశాన్ని ఇబ్బందుల పాలు చేసింది. పదేళ్ల క్రితం అమెరికా – ఇజ్రాయెల్‌లు సంయుక్తంగా ఈ వైరస్ సృష్టించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇదిలా ఉంటే ఇరాన్‌కు చెందిన కొందరు హ్యాకర్లు అమెరికాలోని ఆర్థిక, చమురు, గ్యాస్ తదితర రంగాలకు చెందిన కంపెనీలను లక్ష్యంగా చేసుకున్నారు. వారు ఈ మెయిళ్లను పంపి హ్యాకింగ్‌కు పాల్పడుతున్నట్లు క్రౌడ్‌స్టెక్, ఫైర్ ఐ తదితర సైబర్ సెక్యూరిటీ కంపెనీలు చెబుతున్నాయి.

సైబర్ దాడులకు ఇరాన్ స్పందించనప్పటికీ ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తలకపై అగ్రరాజ్యానికి మరోసారి వార్నింగ్ ఇచ్చింది. తమతో యుద్ధానికి దిగితే పరిస్థితి అదుపు తప్పిపోతుందని, పరిణామాలు తీవ్రంగా ఉంటాయని స్పష్టం చేసింది. అమెరికా సైనికుల ప్రాణాలు కాపాడుకునేందుకు అక్కడి ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని స్పష్టం చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *