ఇది మా అంతర్గత వ్యవహారం.. కలగజేసుకోవద్దు: చైనా ఘాటు స్పందన

చైనాలోని జిన్ జియాంగ్ ప్రాంతంలోని ఉయిఘర్లు, కజక్, ఇతర ముస్లింలపై జరుగుతున్న అణచివేతను పలు దేశాలు ప్రత్యక్షంగా ప్రశ్నిస్తున్న సంగతి తెలిసిందే. ప్రత్యేక క్యాంపుల్లో లక్షలాది మంది ముస్లింలను నిర్బంధించడంపై విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, చైనాలోని పశ్చిమ ప్రాంతంలో ముస్లింలపై అణచివేత చర్యలను వెంటనే ఆపివేయాలని… లేకపోతే ఈ కార్యకలాపాల్లో పాలుపంచుకున్న చైనా అధికారులకు వీసాలను రద్దు చేస్తామని నిన్న అమెరికా హెచ్చరించింది. వీసాల రద్దు అధికారులతో పాటు వారి కుటుంబసభ్యులకు కూడా వర్తిస్తుందని తెలిపింది. వారి పిల్లలు అమెరికాకు వచ్చి చదువుకోలేరని చెప్పింది.

ముస్లింలపై చైనా అణచివేత అత్యంత క్రూరమైన చర్య అని అమెరికా విదేశాంగ మంత్రి మండిపడ్డారు. నిర్బంధంలో మగ్గుతున్న లక్షలాది ముస్లింలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు.

మరోవైపు, అమెరికా హెచ్చరికలపై చైనా మండిపడింది. తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని హెచ్చరించింది. మతం పేరుతో తమ గడ్డపై తీవ్రవాదం, ఉగ్రవాదాన్ని పెంచేందుకు ప్రయత్నిస్తున్న వారిని క్షమించలేమని తెలిపింది. ఇలాంటి చర్యలకు అడ్డుకట్ట వేయడానికే తాము కౌంటర్ టెర్రరిజం కార్యకలాపాలను చేపట్టామని వెల్లడించింది. తాము చేపట్టిన చర్యలను జిన్ జియాంగ్ లో ఉన్న రెండున్నర కోట్ల మంది ప్రజలు కొనియాడుతున్నారని తెలిపింది. తమ అంతర్గత వ్యవహారాల్లో తల దూర్చడానికే తమపై అమెరికా అసత్య ఆరోపణలు చేస్తోందని మండిపడింది.
Tags: China, USA, Xinjiang, Uighurs, Muslims

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *