ఆ రోజు కోసం తెలంగాణ ప్రజలు ఎదురుచూస్తున్నారు: విజయశాంతి

తెలంగాణలోని టీఆర్ఎస్ పాలనపై కేంద్రం నిఘా పెట్టడం శుభపరిణామమని కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి అన్నారు. అయితే, ఇది కేవలం నిఘాతో ఆగిపోకూడదని అన్నారు. కేసీఆర్ పాలనలోని అవకతవకలపై చర్యలు తీసుకునే రోజు కోసం తెలంగాణ ప్రజలు ఎదురుచూస్తున్నారని అన్నారు. అప్పుడే బంగారు తెలంగాణ కల సాకారం అవుతుందని, ఆ పేరుతో ఇంతకాలం ఆడుతున్న నాటకానికి తెరపడుతుందని అన్నారు. టీఆర్ఎస్ పెద్దలు వేసుకున్న ముసుగు తొలగిపోయి, వారి నిజ స్వరూపం బయటపడే రోజు వస్తుందని విజయశాంతి ఆశాభావం వ్యక్తం చేశారు.

టీఆర్ఎస్ పాలనలో తెలంగాణలో అక్రమాలు పెరిగిపోయాయని విజయశాంతి ఆరోపించారు. ఈ విషయాన్ని ప్రతిపక్షాలు ఆరోపణలతో సహా నిరూపించినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ప్రజాధనాన్ని ప్రభుత్వం విచ్చలవిడిగా దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు. ప్రతిపక్ష నేతల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ అవినీతిపై ప్రశ్నిస్తే పరువునష్టం దావా వేస్తామని బహిరంగంగానే బెదిరిస్తున్నారని అన్నారు. కేసీఆర్ పాలనలోని అవినీతిపై వివరాలు సేకరిస్తున్నామని కేంద్రం చెప్పడం శుభపరిణామమని పేర్కొన్న విజయశాంతి.. నిఘాతోనే సరిపెట్టకుండా చర్యల వరకు వెళ్లాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు.
Tags: Telangana, Vijayashanthi,Congress,TRS,BJP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *