ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే దిశగా మరో ముందడుగు

ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేసే దిశగా మరో కీలక ముందడుగు పడింది. తమ సంస్థలో ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని ఏపీఎస్‌ఆర్టీసీ పాలకమండలి సమ్మతించింది. ఈ మేరకు  తీర్మానం చేసింది. అలాగే ఎలక్ట్రికల్ బస్సులను అద్దెకు తీసుకునేందుకూ ఆమోదం తెలిపింది. విజయవాడలోని ఆర్టీసీ హౌస్‌లో శుక్రవారం ఆర్టీసీ పాలకమండలి సమావేశమైంది. ఈ సందర్భంగా మొత్తం 27 అంశాలను చర్చించి ఆమోదం తెలిపింది.ఆర్టీసీలో పనిచేసే ఉద్యోగులందరినీ ప్రభుత్వంలో విలీనం చేయాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు క్యాబినెట్ ఆమోదం తెలపగా విధివిధానాలపై నిపుణుల కమిటీ అధ్యయనం చేస్తోంది.

తాజాగా ఈ అంశంపై పాలకవర్గ సమావేశంలో చర్చించి, విలీనానికి సమ్మతమేనని తీర్మానించారు.ఆర్టీసీలో కేంద్రం వాటా ఉండటంతో విలీన అంశాన్ని బోర్డులో ఉన్న కేంద్రప్రభుత్వ ప్రతినిధులకు వివరించారు. ఆర్టీసీ సంస్థ, ఆస్తులు కాకుండా ఉద్యోగులనే విలీనం చేస్తుండటంతో దీనికి కేంద్ర అధికారులు అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది. ఏ రాష్ట్రంలోనూ ఇలా కార్మికులను ప్రభుత్వంలో విలీనం చేయలేదని, ఇది మంచి నిర్ణయమేనని ఆ ప్రతినిధులు అభిప్రాయపడినట్లు సమాచారం. కేంద్రం ఫేమ్‌-2 పథకం కింద అందించే సాయంతో గ్రాస్‌ కాస్ట్‌ కాంట్రాక్ట్‌  విధానంలో 350 ఎలక్ట్రికల్ బస్సులు అద్దెకు తీసుకోనుండగా, దీనికి ఆమోదముద్ర వేశారు.

కడప ఆర్టీసీ బస్టాండ్‌ ఆవరణలో కార్మికుల కోసం 30 పడకల ఆసుపత్రి నిర్మాణం, హైదరాబాద్‌లో ఏపీఎస్‌ఆర్టీసీ బస్సులను నిలిపేందుకు బీహెచ్‌ఈఎల్‌ వద్ద గతంలో కొనుగోలుచేసిన స్థలంలో డ్రైవర్లు, కండక్టర్ల విశ్రాంతి కోసం భవన నిర్మాణానికి ఆమోదం తెలిపారు. అలాగే, విజయవాడలోని పాత బస్టాండ్‌ వద్ద స్థలాన్ని గతంలో ఓ సంస్థకు ఇచ్చేందుకు చేసుకున్న ఒప్పందాన్ని రద్దుచేశారు.కుటుంబ నియంత్రణ చేయించుకున్న కార్మికులకు ప్రోత్సాహకం ఇచ్చే పథకం, ఐదేళ్లకుపైగా సర్వీసులో ఉండి అనారోగ్యంతో విధుల నుంచి తప్పుకుని వారి స్థానంలో కుటుంబసభ్యులకు అవకాశం కల్పించేలా ఇచ్చిన సర్క్యులర్‌ను రద్దుచేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఎండీ ఎంటీ కృష్ణబాబు నియామకాన్ని కూడా ఆమోదించారు.

Tags: AP CM, YS Jagan’s Sensational, Decision On RTC, RTC Merge

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *