అసలు కొత్త అసెంబ్లీ ఎందుకు?: కేసీఆర్ సర్కారుకు హైకోర్టు సూటి ప్రశ్న

హైదరాబాద్ లో నూతనంగా అసెంబ్లీని నిర్మించాల్సిన అవసరం ఏంటని, ఇప్పుడున్న అసెంబ్లీలో సదుపాయాల కొరత ఏంటని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. నూతన అసెంబ్లీ నిర్మాణంపై కాంగ్రెస్ సహా పలువురు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలను విచారణకు స్వీకరించిన హైకోర్టు, ఎర్రమంజిల్‌ భవనాల కూల్చివేతకు అనుమతులు తీసుకున్నారా? అని ప్రశ్నించింది.

హుడా చట్టం ప్రకారం ఎర్రమంజిల్‌ భవనాలకు రక్షణ ఉందని గుర్తు చేసిన కోర్టు, హుడా స్థానంలో వచ్చిన హెచ్‌ఎండీఏ అనుమతులు లభించాయా? అని కూడా అడిగింది. పాత భవనాల కూల్చివేతకు అనుమతులు ఉన్నాయో, లేదో చెప్పడానికి జాప్యం ఎందుకని మండిపడింది. అసెంబ్లీని నిర్మించేందుకు ఎర్రమంజిల్‌ లోని పురాతన భవనాలను కూల్చి వేయవద్దని పలు పిటిషన్లు దాఖలైన సంగతి తెలిసిందే. ఇవి హెరిటేజ్ భవంతులని, వీటిని పరిరక్షించేందుకు గతంలో హుడా పలు నిబంధనలు విధించిందని పిటిషనర్ తరఫు న్యాయవాదులు కోర్టుకు గుర్తు చేయగా, ఆ నిబంధనలను గతంలోనే తొలగించినట్టు ప్రభుత్వ అదనపు అడ్వకేట్‌ జనరల్‌ రామచంద్రరావు వాదించారు. ఆపై కేసు విచారణ వాయిదా పడింది.
Tags: High Court, Assembly, Hyderabad, Telangana, KCR

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *