అల్లదివో జలవాసము!

అల్లదివో జలవాసము!

సాగునీటి ప్రాజెక్టుల్లోనే ఓ అద్భుతం ఆవిష్కారం కానుంది. లక్షలమంది కార్మికుల శ్రమ, వేలమంది ఇంజినీర్ల ప్రతిభ ఫలితాలనివ్వబోతున్నది. తెలంగాణ వ్యవసాయం దశ దిశను మార్చేందుకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ధరించిన జల సంకల్పం.. అతిత్వరలో సిద్ధించబోతున్నది. పల్లమెరిగే నీరు ఏటికి ఎదురీది చెరువులను నింపేందుకు, తెలంగాణ మాగాణాలను ఫలవంతం చేసేందుకు పరుగులుతీసే అపురూప ఘడియలు.. మరికొద్ది రోజుల్లోనే సాక్షాత్కరించనున్నాయి. 18.82 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించడంతోపాటు.. కొత్తగా 18.25 లక్షల ఎకరాల కొత్త ఆయుకట్టుకు సాగునీరు అందించే తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం జల ఆవాసం.. వేగంగా సిద్ధమవుతున్నది. ప్రధాన నదిపై మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల వద్ద నిర్మిస్తున్న బరాజ్‌లు తుదిరూపు సంతరించుకుంటుండగా.. గోదారమ్మను ఎత్తిపోయడంలో కీలకమైన మోటర్ల బిగింపు పనులు సైతం వేగంగా పూర్తవుతున్నాయి. వెరసి.. ఈ వానకాలం నుంచే నీటిని ఎత్తిపోసేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు.
ఈ వానకాలంలోనే కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో తెలంగాణ గడ్డ మీద ఉన్న చెరువులను నింపాలన్న ప్రభుత్వ జలసంకల్పం మేరకు పనులు వడివడిగా సాగుతున్నాయి. ప్రధానంగా గోదావరి నదిపై నిర్మిస్తున్న మూడు బరాజ్‌లు తుదిరూపు సంతరించుకుంటుండగా.. గోదారమ్మ ను ఎత్తిపోసి, బీడు భూములను పండించడం లో కీలకమైన మోటర్ల బిగింపు పనులు సైతం శరవేగంగా సాగుతున్నాయి. రెండుచోట్ల మోటర్ల వెట్న్‌ (నీటిని ఎత్తిపోసే పరీక్ష)కు అధికారులు సిద్ధమయ్యారు. మేడారం బరాజ్‌ ఫోర్‌షోర్‌లోని నీటిని ఎత్తిపోసేందుకు నిర్మిస్తు న్న కన్నెపల్లి పంపుహౌస్‌తోపాటు ఎల్లంపల్లి తర్వాత జలాలను మేడారం రిజర్వాయర్‌లోకి ఎత్తిపోసేందుకు చేపట్టిన మేడారం పంపుహౌస్‌లోనూ వెట్న్‌క్రు అధికారులు రంగం సిద్ధంచేశారు.

తద్వారా వానకాలంలో నిరవధికంగా గోదావరి జలాలను ఎత్తిపోసేందుకు సాంకేతికంగా సిద్ధమయ్యేందుకు ప్రణాళిక రూపొందించారు. మరోవైపు మేడిగడ్డ నుంచి మిడ్‌మానేరు మార్గంలో సవాల్‌గా మారిన జంట సొరంగాలు కూడా మరికొన్ని రోజుల్లో అందుబాటులోకి రానున్నాయి. కేవలం కిలోమీటర్‌లోపు లైనింగ్‌ పనులు పూర్తయితే మేడిగడ్డ నుంచి మిడ్‌మానేరు వరకు ఎలాంటి అడ్డంకులూ ఉండవు. గోదావరిని ఒడిసిపట్టే బరాజ్‌లు మరోవైపు పౌరరవాణాకు కూడా వారధులుగా మారనుండటం పరిసర గ్రామాల ప్రజలకు వరంగా మారనున్నది. బరాజ్‌లపై బీటీ రోడ్ల నిర్మాణం తో ఇప్పటికే వాహనాల రాకపోకలకు అన్నా రం, సుందిల్ల బరాజ్‌లు అందుబాటులోకి రాగా.. మేడారం బరాజ్‌ వచ్చే నెలలో అందుబాటులోకి రానున్నదని అధికారులు చెప్తున్నారు. వీటిపై రాకపోకలకు అనుమతి ఇస్తే లక్షలమంది వాహనదారులకు వ్యయ ప్రయాసలు తగ్గనున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *