అమ్మా బైలెల్లినాదో..

డప్పు చప్పుళ్ల హోరు, శివసత్తుల పూనకాలు, పోతరాజుల నృత్యాలు, యువత కేరింతల నడుమ హైదరాబాద్‌లో ఆషాఢ బోనాల వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. చారిత్రక గోల్కొండ జగదాంబిక అమ్మవారికి కుమ్మరులు గురువారం మధ్యాహ్నం తొలి బోనం సమర్పించడంతో సంబురాలు మొదలయ్యాయి. బోనాల ఉత్సవాల్లో ప్రధాన భూమిక పోషించే తొట్టెలు, పట్టు వస్ర్తాల ఊరేగింపు మధ్యాహ్న వేళ ఉత్సాహభరిత వాతావరణంలో లంగర్‌హౌస్ చౌరస్తా నుంచి గోల్కొండకోటలోని అమ్మవారి ఆలయం వరకు కొనసాగింది. ఊరేగింపులో దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ పాల్గొని రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్ర్తాలు, బంగారు, వెండి బోనాలు సమర్పించారు.

ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్టు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు సమృద్ధిగా కురువాలని, పంటలు బాగా పండాలని, అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలని వేడుకున్నట్టు చెప్పారు. బోనాల ఉత్సవాల సందర్భంగా పలు ఆలయాల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. ఆషాఢమాసం ఆగస్టు ఒకటి వరకు ఉన్నందున ఒక్కోవారం ఒక్కో ప్రాంతంలో సుమారు నెలరోజులపాటు జంటనగరాల్లో బోనాల జాతర కొనసాగనున్నది. కార్యక్రమంలో ఆలయ ఈవో మహేందర్‌కుమార్ కొడమంచి, బోనాల ఉత్సవాల కమిటీ చైర్మన్ గోపిరెడ్డి వసంత్‌రెడ్డి, సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.
Tags: Bonalu Festival , Golkonda Bonalu 2019 , Goddess Mahakali , Minister Indrakaran Reddy , Talasani Srinivas Yadav

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *